Begin typing your search above and press return to search.

ఆరో అభ్యర్థి: కాంగ్రెస్ ని దెబ్బ కొట్టే స్కెచ్ తో కేసీఅర్ ?

ఒకేసారి ఏపీ తెలంగాణాలలో చెరి అయిదు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికలు జరగనున్నాయి.

By:  Tupaki Desk   |   7 March 2025 6:00 PM IST
ఆరో అభ్యర్థి: కాంగ్రెస్ ని దెబ్బ కొట్టే స్కెచ్ తో కేసీఅర్ ?
X

ఒకేసారి ఏపీ తెలంగాణాలలో చెరి అయిదు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో చూస్తే టీడీపీ కూటమికి అసెంబ్లీలో 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దాంతో సులువుగా అయిదు ఎమ్మెల్సీ సీట్లూ ఆ పార్టీ ఖాతాలో పడనున్నాయి. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీ కనీసం పోటీ ఆలోచనకు కూడా సాహసించలేని పరిస్థితి ఉంది. దాంతో ఏపీలో ఈ నెల 10న నామినేషన్ల దాఖలుకు చివరి రోజున కూటమి నుంచే అభ్యర్ధులు ఉంటారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. దాంతో ఏపీ రాజకీయంలో మజా ఏమీ ఉండదు.

కానీ తెలంగాణాలో సీన్ అలా కాదు, అక్కడ బీఆర్ఎస్ బలంగా ఉంది. ఆ పార్టీకి కనీసంగా ఒక్క సీటు అయినా దక్కుతుంది. అయితే నిజానికి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచి వచ్చారు. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణించడంతో ఉప ఎన్నిక వచ్చి అక్కడ సీటు పోయింది. మిగిలిన 38 మందిలో పది మంది కాంగ్రెస్ వైపుగా వెళ్ళారు. దాంతో 28 మంది మాత్రమే బీఆర్ఎస్ కి మిగిలారు.

ఇక మొత్తం 119 మంది ఎమ్మెల్యేల కోటా నుంచి 5గురు ఎమ్మెల్సీలు తీసుకుంటే కచ్చితంగా ఒక్కో ఎమ్మెల్సీ గెలవడానికి 24 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంటే బీఆర్ స్ కి 28 మంది ఉంటే ఒక్కరే తప్ప ఇద్దరు అన్నది సాధ్యపడదు. కానీ కేసీఆర్ ఈ విషయంలో మాస్టర్ స్కెచ్ ని గీస్తున్నారు అని అంటున్నారు.

ఆయన తాజాగా తన ఫాం హౌస్ లో పార్టీ సీనియర్లతో ఇదే విషయం మీద సీరియస్ గా మీటింగ్ పెట్టారని అని అంటున్నారు. ఈ మీటింగ్ కి కేటీఆర్ హరీష్ రావు, కవిత, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ సహా కీలక నేతలు అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి రెండో అభ్యర్ధిని పోటీకి పెట్టాలన్న తన ఆలోచనను కేసీఆర్ పార్టీ సీనియర్లతో పంచుకున్నారని అంటున్నారు.

ఈ విధంగా చేయడానికి చాలా లెక్కలు ఉన్నాయని అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్ళినా వారు టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. అందువల్ల బీఆర్ ఎస్ తన ఇద్దరు అభ్యర్థులను పోటీకి పెట్టి విప్ జారీ చేస్తుందని అంటున్నారు. విప్ జారీతో ఆ పది మంది ఎమ్మెల్యేలు కచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్ధికి ఓటు చేయాల్సి ఉంటుంది. లేకపోతే దాన్ని సాకుగా చూపించి వారి సభ్యత్వం మీద అనర్హత వేటు వేయించేందుకు బీఆర్ఎస్ కి ఎంతో అవకాశం ఉంటుంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మద్దతు ఆ కాంగ్రెస్ కి దక్కకుండా చేయడం కూడా వ్యూహంగా ఉంది అని అంటున్నారు. పది మంది ఎమ్మెల్యేలు తగ్గితే అపుడు కాంగ్రెస్ నిలబెట్టే నాలుగో ఎమ్మెల్సీ అభ్యర్ధికి ఓట్లు తగ్గుతాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులో పడుతుంది.

ఈ విధంగా అయిదు ఎమ్మెల్సీ ఖాళీలు ఉంటే ఆరవ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా పొలిటికల్ గా యమ టెన్షన్ క్రియేట్ చేయడంతో పాటు వీలైతే ఆ సీటుని గెలుచుకుని సత్తా చాటాలని బీఆర్ఎస్ చూస్తోంది అని అంటున్నారు. అదే విధంగా బీఆర్ ఎస్ ని వీడిన వారి మీద అనర్హత వేటు వేసేందుకు పూర్తి ఆధారాలు తీసుకునేందుకు ఈ ఎన్నికలు ఒక విధంగా ఉపయోగపడతాయని అంటున్నారు.

ఈ నెల 20న తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. ఇక బీఆర్ఎస్ నుంచి రెండో అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నిలబెడతారు అని అంటున్నారు. బడుగు వర్గాలకు చెందిన వారిని నిలబెట్టడం కూడా మరో వ్యూహంగా ఉందని అంటున్నారు. చూడబోతే తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాక పుట్టించేలా ఉన్నాయని అంటున్నారు.