Begin typing your search above and press return to search.

హరీశ్‌రావుకు, ఆ కానిస్టేబుల్‌కు మధ్య ఏం జరిగింది..?

బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో కలకలం రేపింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   5 Dec 2024 7:26 AM GMT
హరీశ్‌రావుకు, ఆ కానిస్టేబుల్‌కు మధ్య ఏం జరిగింది..?
X

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో కలకలం రేపింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ హరీశ్‌రావు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లగా.. ముందుగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పోలీసులతో హరీశ్ రావు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హరీశ్ రావును వెంటనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తరువాత వెంటనే కౌశిక్ రెడ్డిని సైతం అరెస్ట్ చేశారు. ఆయనను బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పోలీసుల విధులను అడ్డుకున్నారని, సీఐని అడ్డగించి బెదిరించారని కౌశిక్‌రెడ్డిపై నిన్న కేసు నమోదైంది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కౌశిక్‌పై కేసు నమోదు కావడంతో ఆయనతో మాట్లాడేందుకు హరీశ్ రావు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు విడివిడిగా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. హరీశ్ రావుును అరెస్ట్ చేస్తున్న క్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే.. హరీశ్ రావు సైతం తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఓ కానిస్టేబుల్ మీద సీరియస్ అయ్యారు. ‘ఇంతకంటే ఎక్కువ చేయకు.. తమాషా చేయకు’ అని కానిస్టేబుల్ అన్నాడంటూ సీరియస్ అయ్యారు.

మరోవైపు.. కౌశిక్ నివాసానికి చేరుకున్న మేడ్చల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు.. హరీశ్, కౌశిక్‌లకు మద్దతుగా గోడదూకి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అతడిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కౌశిక్ ఇంటికి వెళ్తున్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని, బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డిని సైతం అరెస్ట్ చేశారు. వీరిని రాయదుర్గం పీఎస్‌కు తరలించారు.

బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. హరీశ్ రావును అక్రమంగా అరెస్ట్ చేసి గచ్చిబౌలికి స్టేషన్‌కు తరలిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే హరీశ్ రావు, రిటైర్డ్ ఆఫీసర్ రాధాకిషన్ రావుపై ఆదివారం సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. ఈ క్రమంలోనే హరీశ్ రావు అరెస్ట్ కావడం రాష్ట్రవ్యాప్తంగానూ కలకలం రేపింది. ఈ సందర్భంగా హరీశ్ రావు స్పందిస్తూ.. ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. ఇదేం విడ్డూరం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ నిలదీశారు. రేవంత్ మార్క్ పాలన ఇదేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.