Begin typing your search above and press return to search.

హైలైట్స్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

By:  Tupaki Desk   |   19 March 2025 1:59 PM IST
హైలైట్స్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26
X

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ.3,04,965 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగాను, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగాను అంచనా వేశారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జవాబుదారీతనంతో పాలన సాగిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్షీణించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల విషయంలో ప్రజలను నిరాశపరిచిందని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ‘మెగా మాస్టర్‌ ప్లాన్‌ 2050’ని రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీని ద్వారా పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చైనా ప్లస్‌ వన్‌ వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రతి మండలంలో మహిళలతో రైస్‌ మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు చేస్తామని, ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్‌ మిల్లుల్లో మిల్లింగ్ చేయించి, ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామని ఆయన అన్నారు. అలాగే, మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు కేటాయిస్తామని తెలిపారు. తెలంగాణ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రమని ఆయన గర్వంగా చెప్పారు.

దేశానికే తలమానికంగా ‘ఫ్యూచర్‌ సిటీ’ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఓఆర్‌ఆర్ ఫేజ్-2 నీటి సరఫరా ప్రాజెక్టు చివరి దశకు చేరుకుందని, దీని ద్వారా హెచ్‌ఎండీఏ పరిధిలోని విస్తరించిన ప్రాంతాలకు తాగునీరు అందుతుందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో సమగ్ర వరద నీటిపారుదల ప్రాజెక్టు కోసం రూ.5,942 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. శ్రీశైలం-నాగార్జునసాగర్ రహదారుల మధ్య 56 గ్రామాలు, 765 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ఏఐ సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్ జోన్లు, మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వంటి సౌకర్యాలు ఉంటాయని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టును ఎఫ్‌సీడీఏ పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు.

- వివిధ రంగాలకు కేటాయింపులు:

పంచాయతీరాజ్‌ శాఖ: రూ.31,605 కోట్లు

వ్యవసాయశాఖ: రూ.24,439 కోట్లు

విద్యాశాఖ: రూ.23,108 కోట్లు

మహిళా శిశుసంక్షేమశాఖ: రూ.2,862 కోట్లు

పశు సంవర్థకశాఖ: రూ.1,674 కోట్లు

పౌరసరఫరాల శాఖ: రూ.5,734 కోట్లు

కార్మికశాఖ: రూ.900 కోట్లు

ఎస్సీ సంక్షేమం: రూ.40,232 కోట్లు

ఎస్టీ సంక్షేమం: రూ.17,169 కోట్లు

బీసీ సంక్షేమం: రూ.11,405 కోట్లు

చేనేత రంగం: రూ.371 కోట్లు

మైనార్టీ సంక్షేమశాఖ: రూ.3,591 కోట్లు

పరిశ్రమలశాఖ: రూ.3,527 కోట్లు

ఐటీ రంగం: రూ.774 కోట్లు

విద్యుత్‌ రంగం: రూ.21,221 కోట్లు

వైద్య రంగం: రూ.12,393 కోట్లు

పురపాలక రంగం: రూ.17,677 కోట్లు

నీటి పారుదలశాఖ: రూ.23,373 కోట్లు

రోడ్లు, భవనాల శాఖ: రూ.5,907 కోట్లు

పర్యాటక రంగం: రూ.775 కోట్లు

క్రీడలు: రూ.465 కోట్లు

అటవీ, పర్యావరణం: రూ.1,023 కోట్లు

దేవాదాయశాఖ: రూ.190 కోట్లు

-ప్రధాన పథకాలకు కేటాయింపులు:

ఆరు గ్యారంటీలు: రూ.56,084 కోట్లు

రైతు భరోసా: రూ.18,000 కోట్లు

చేయూత పింఛన్లు: రూ.14,861 కోట్లు

ఇందిరమ్మ ఇళ్లు: రూ.12,571 కోట్లు

మహాలక్ష్మి పథకం: రూ.4,305 కోట్లు

గృహజ్యోతి: రూ.2,080 కోట్లు

సన్నాలకు బోనస్: రూ.1,800 కోట్లు

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ: రూ.1,143 కోట్లు

గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ: రూ.723 కోట్లు

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా: రూ.600 కోట్లు

రాజీవ్‌ యువ వికాసం: రూ.6,000 కోట్లు