భస్మాసు‘హస్తాలు’... మంత్రివర్గ విస్తరణకు వారే అడ్డంకి?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా పడింది. 13 నెలలుగా నేడు.. రేపు అంటూ జరుగుతున్న ప్రచారానికి ఇప్పటికీ పుల్ స్టాప్ పడలేదు.
By: Tupaki Desk | 8 Feb 2025 6:30 AM GMTతెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా పడింది. 13 నెలలుగా నేడు.. రేపు అంటూ జరుగుతున్న ప్రచారానికి ఇప్పటికీ పుల్ స్టాప్ పడలేదు. ఎండింగ్ లేని డైలీ సీరియల్ లా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం సుదీర్ఘంగా సాగుతోంది. ఈ పరిస్థితికి కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరి మొండి పట్టుదల వల్ల ఏడాది క్రితమే మంత్రులు కావాల్సిన ఒకరిద్దరు ఎప్పటికీ ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రివర్గ విస్తరణపై సీనియర్ నేతల తీరు చూస్తే భస్మాసురుడే గుర్తుకు వస్తున్నాడని రాజకీయ విమర్శకులు విశ్లేషిస్తున్నారు. భస్మాసురుడు ఎలా అయితే తనను తాను కాల్చుకుని బూడిద అయ్యాడో.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా మంత్రి పదవుల కోసం తమను తామే వెనక్కి నెట్టేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని నిందలు మోస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. శుక్రవారం కూడా మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ చార్జి దీప్ దాస్ మున్షీలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. ఆయన ముందు కూడా నేతలు ఒక్కో పేరు సూచించడం వల్ల గందరగోళమే ఎదురైందని చెబుతున్నారు.
మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉంటే దాదాపు డజనుకు పైగా నేతలు పదవులను ఆశిస్తున్నారు. దీంతో ఎవరికి ఓకే చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా చేతులెత్తేసినట్లు చెబుతున్నారు. మంత్రి పదవి ఆశిస్తున్న మల్ రెడ్డి రంగారెడ్డి సీఎం రేవంత్ ను కలవగా, అధిష్ఠానంతో మాట్లాడాలని ఆయన సూచించారని అంటున్నారు. వాస్తవానికి 2023 డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించి మొత్తం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని సీఎం భావించారని చెబుతున్నారు. కానీ, ఆ ప్రయత్నాన్ని ఏఐసీసీ అడ్డుకోవడంతో ఇప్పుడు అది చిక్కుముడిగా మారిందని చెబుతున్నారు.
ఆరు ఖాళీల్లో రెండింటిపై క్లారిటీ ఉన్నా, మిగిలిన నాలుగు భర్తీ చేయడానికి కాంగ్రెస్ ఆపసోపాలు పడుతోందని అంటున్నారు. ముదిరాజ్ సామాజికవర్గానికి మంత్రి వర్గం చోటు ఇస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. ఆ మేరకు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు లైన్ క్లియర్ గా ఉందని చెబుతున్నారు. అదేవిధంగా సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి చివరి చాన్స్ గా మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి విషయంలో పార్టీకి క్లారిటీ ఉన్నా మిగిలిన పదవుల విషయంలోనే పీటముడి వీడటం లేదని అంటున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ నేతలతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడుతోందని విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. వీరు కాకుండా ఎన్నికల సందర్భంగా తనకు హామీ ఇచ్చారని కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలనుకుంటున్నారు. దీంతో ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవి ఎలా అంటూ పార్టీ డైలమాలో పడిపోతోందని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే బీర్ల ఐలయ్య, బాలూ నాయక్ పదవులను ఆశిస్తున్నారు. లంబాడా, ఎస్టీ కోటాలో బాలూనాయక్ తన ప్రయత్నాలు చేస్తుండగా, ఉమ్మడి జిల్లా అన్న కోణం ఆయనకు రూట్ క్లియర్ చేయడంలో ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. దీంతో ఎస్టీల్లో మురళీనాయక్, రామ చంద్రు నాయక్ కూడా పోటీపడుతున్నారు. అదేవిధంగా మైనార్టీల నుంచి అజారుద్దీన్, షబ్బీర్ అలీతోపాటు ఇటీవల ఎమ్మెల్సీగా నామినేట్ అయిన అమిర్ అలీఖాన్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఎస్సీ కేటగిరీ నుంచి ఎమ్మెల్యే వివేక్ ప్రయత్నిస్తున్నారు. తనకు కూడా పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు పట్టుబడుతున్నారు. ఈయనకు పోటీగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పదవిని ఆశిస్తున్నారు.
ఇలా మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉండటం, అందరినీ ఓ చోట కూర్చోబెట్టి సర్ది చెప్పే ప్రయత్నాలు చేయకపోవడం వల్ల మంత్రివర్గ విస్తరణ ఎడతెగని సీరియల్ గా మారిందని అంటున్నారు. అదేవిధంగా సమన్వయ సంఘంలోని నలుగురు నేతలు నాలుగు వైపులా లాగుతుండటం వల్ల అధిష్ఠానం పెండింగులో పెడుతోందని అంటున్నారు. ఇప్పుడు మంత్రివర్గాన్ని విస్తరిస్తే స్థానిక ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న కారణంతో మళ్లీ వాయిదా వేసిందని అంటున్నారు.