6 గంటలు సాగిన రేవంత్ కాబినెట్ భేటీ.. నిర్ణయాలు ఇవే
గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైన మంత్రివర్గ సమావేశం రాత్రి 9 గంటల వరకు సాగింది.
By: Tupaki Desk | 7 March 2025 11:35 AM ISTకేసీఆర్ ప్రభుత్వంలో నిర్వహించే మంత్రివర్గ సమావేశాలు సుదీర్ఘంగా సాగేవి. అందుకు భిన్నంగా రేవంత్ సర్కారులో కేబినెట్ భేటీలు త్వరగా ముగిసేవి. గురువారం మాత్రం అందుకు భిన్నమైన సన్నివేశం ఆవిష్క్రతమైంది. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైన మంత్రివర్గ సమావేశం రాత్రి 9 గంటల వరకు సాగింది. అంటే.. ఆరు గంటలు. ఇంత సుదీర్ఘంగా కేబినెట్ భేటీ ఇటీవల కాలంలో ఇదేనని చెబుతున్నారు.
ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అన్నింటికి మించి షెడ్యూల్ కులాల వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్లపై చట్టాలను రూపొందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ సర్వేలు.. కమిషన్ల నివేదికలు.. మేధావులు.. కుల సంఘాల అభిప్రాయం ఆధారంగా విస్తృత కసరత్తు చేసి.. చట్టాలను తయారు చేసేందుకు వీలుగా మూడు ముసాయిదా బిల్లులకు ఓకే చెప్పింది.
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుతో పాటు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం.. విద్య.. ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి రెండు ముసాయిదా బిల్లులకు ఓకే చెప్పి.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టి.. ఆమోదించాలని నిర్ణయించారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు.. ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండేందుకు వీలుగా కేంద్రానికి తమ వాణిని వినిపించాలని నిర్ణయించారు.
ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఓఆర్ ఆర్ నుంచి ఆర్ఆర్ఆఱ్ వరకు ఫ్యూచర్ సిటీగా ప్రకటించటం జరిగిందని. ఈ ప్రాంతంలో ఏడు మండలాలు.. 56 గ్రామాల్ని కలిపి ఫ్యూచరర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీగా ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయించింది.
నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని నిర్ణయించారు. ఈ 56 గ్రామాలతో పాటు ఇదివరకు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను ఎఫ్ సీడీఏకు బదిలీ చేయటంజరిగిందని.. దీనికి 90 పోస్టుల్ని మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదించింది. హెచ్ఎండీఏ పరిధిని రీజినల్ రింగు రోడ్డు దాటి రెండు కిలోమీటర్ల బఫర్ జోన్ వరకు విస్తరించారు.
దీంతో 11 జిల్లాలు.. 104 మండలాలు.. 1354 గ్రామ పంచాయితీలు హెచ్ ఎండీఏ పరిధిలో ఉంటాయి. మరో 332 రెవెన్యూ గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ఇందిరామహిళా శక్తి మిషన్ కింద ఇందిరా మహిళా శక్తి పాలసీ 2025కు క్యాబినెట్ ఓకే చెప్పింది. రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాలన్నీ ఒకే గొడుగు కింద ఉండాలని నిర్ణయించారు. ఇందిరా మహిళా శక్తి గ్రూపుల్లో గతంలో 60 ఏళ్లకే సభ్యులకు రిటైర్మెంట్ ఉండేదని.. దీనిని 65 ఏళ్లకు పొడిగించినట్లుగా పేర్కొన్నారు. గతంలో 18 ఏళ్లు నిండినవారికే సభ్యులుగాచేరే అవకాశం ఉండేదని.. దీన్ని 15 ఏళ్లకు కుదించినట్లుగా పేర్కొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు మాదిరిగానే యాదగిరిగుట్ట నర్సింహస్వామి ఆలయానికి ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్లు యాక్టును సవరించాలి నిర్ణయించారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ పర్యాటక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్రంలో అనేక టూరిస్టు స్పాట్‌లు ఉన్నా, ఒక పాలసీ లేకపోవడం వల్ల నష్టం జరిగింది. తెలంగాణకు కూడా ఒక టూరిజం పాలసీ ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. రాబోయే ఐదేళ్లలో కొత్త పాలసీకి తగ్గట్లు రూ.15 వేల కోట్లకు తగ్గకుండా పెట్టుబడులు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.
మేలో జరిగే ‘మిస్ వరల్డ్’ పోటీలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు లోటు జరగకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 10,954 రెవెన్యూ గ్రామాలకు పట్టించుకునే నాథుడు లేరని.. అందుకే గతంలో రద్దు చేసిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థలోని అర్హులైన వారిని ఈ పోస్టుల్లో నియమించాలని నిర్ణయించడం జరిగింది.
శంషాబాద్ మండలంలో 100 పడకల ఈఎ్‌సఐ ఆస్పత్రి నిర్మాణానికి 5.15 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పారాలింపిక్స్-2024 కాంస్య పతక విజేత దీప్తి జీవాంజికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను గత ప్రభుత్వంలో మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. వాటికి పోస్టులను కేటాయించలేదు. అందుకే, వాటికి 361 పోస్టులను మంజూరుతో పాటుతెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలలకు 330 రెగ్యులర్, 165 ఔట్‌సోర్సింగ్.. మొత్తం 495 పోస్టులకు ఆమోదం తెలిపారు.