మోడీకి వినతి: కులగణన, బీసీ రిజర్వేషన్లు.. ఆమోదించండి ప్లీజ్
తెలంగాణలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా కులగణన, బీసీ రిజర్వేషన్‌కు పచ్చ జెండా ఊపింది.
By: Tupaki Desk | 4 Feb 2025 10:30 PM GMTతెలంగాణలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా కులగణన, బీసీ రిజర్వేషన్‌కు పచ్చ జెండా ఊపింది. తాజాగా మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా ఈ రెండు అంశాలపై చర్చించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ఈ రెండు అంశాలను కూడా.. రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టా త్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ భేటీలో ఈ రెండు అంశాలపై కూలంకషంగా చర్చించి.. ఆమోదం తెలిపింది. ఇక, వీటిని మంగళవారమే అసెంబ్లీలో ప్రవేశ పెట్టి.. చర్చించి.. ఆవెంటనే ఆమోదించనున్నారు. అనంతరం కేంద్రానికి పంపనున్నారు.
కుల గణన..
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే.. కులగణన చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తాజాగా కొన్నాళ్ల కిందటే గణన చేపట్టారు. ఇది పూర్తియిన విషయం తెలిసిందే. 46 శాతానికి పైగా ప్రజలు బీసీలేనని ఈ సర్వే చాటింది. అదేవిధంగా ముస్లింలలో ఉన్న బీసీలను(దూదేకులు, నూర్ బాషాలు, మస్తాన్‌లు) వంటివారు మరో 10 శాతం ఉన్నారని లెక్కతేలింది. ఈ నేపథ్యంలో దీనిని అధికారికంగా ఆమోదిస్తూ.. కేబినెట్ నిర్ణయించింది. అయితే.. ఇది కేంద్రం ఆమోదించాల్సిన అవసరం ఉండడంతో ప్రభుత్వం ఆదిశగా కేంద్రానికి పంపనుంది.
రిజర్వేషన్లు..
బీసీ జనాభా రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్ననేపథ్యంలో వారికి 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది రేవంత్ రెడ్డి సర్కారు వ్యూహం. ఈ క్రమంలోనే .. దీనికి సంబంధించి అంశాన్ని కూడా కేబినెట్ సమగ్రంగా చర్చించి ఆమోదించింది. అయితే.. ఇది రాజ్యాంగంతోనూ రాష్ట్రపతితోనూ కూడుకున్న వ్యవహారం కావడంతో తాజాగా అసెంబ్లీలో చర్చించిన అనంతరం.. తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. ఈ రెండు అంశాలకు మోడీ సర్కారు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న బడ్జట్ సమావేశా ల్లోనే వీటిని ఆమోదించుకునే దిశగా కాంగ్రెస్ ఎంపీలు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.
ఇక, మూడోది..
తాజా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చిన ముచ్చటగా మూడో అంశం.. ఎస్సీ రిజర్వేషన్‌పై ఏకసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టు. ఈ నివేదికకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే.. దీనిని కూడా అసెంబ్లీలో చర్చించనున్నారు. అనంతరం కేంద్రానికి పంపించి.. అక్కడ ఆమోద ముద్ర వేయించుకున్నాక.. తెలంగాణలో అమలు చేస్తారు. ఎస్సీలను ఏ-బీ-సీలుగా వర్గీకరిస్తూ.. రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి షమీం అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.
నివేదికను పరిశీలిస్తే.. ఎస్సీలను ప్రధానంగా మూడు వర్గాలు(ఏ, బీ, సీ)గా విభజించారు.
+ గ్రూప్ ఏ: సంచార జాతులు
+ గ్రూప్ బీ: మాదిగ, మాదిగ ఉపకులాలకు 9శాతం
+ గ్రూప్ సి: మాల, మాల ఉపకులాలకు 5 శాతం రిజర్వేషన్