Begin typing your search above and press return to search.

తెలుగు నాట తొలి బీసీ సీఎం అక్కడ నుంచేనా ?

ఇదిలా ఉంటే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అయితే కుల గణన మీద కాంగ్రెస్ చిత్త శుద్ధిని చాటి చెబుతున్నారు. ఆయన తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కుల గణన జరగాలి.

By:  Tupaki Desk   |   15 Feb 2025 2:30 AM GMT
తెలుగు నాట తొలి బీసీ సీఎం అక్కడ నుంచేనా ?
X

బీసీలు దేశంలో అనేక రాష్ట్రాలలో సీఎంలు అయ్యారు. అంతవరకూ ఎందుకు దక్షిణాదిన బీసీ సీఎంలు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా అయ్యారు. ఇక్కడ మొదట్లో అగ్రకులాలు రాజ్యం చేసినా చివరికి బీసీలకు అధికార యోగం దక్కింది. దేశంలో చూసుకుంటే బీసీల జనాభా ఎక్కువ అన్నది అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీ తెలంగాణాలలో కానీ ఇప్పటిదాకా బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరికీ సీఎం పదవి దక్కలేదు. ఇతర సామాజిక వర్గాల నుంచి సీఎంలు అయిన వారు ఉన్నారు. కానీ బీసీ సీఎం ముచ్చట అయితే తీరలేదు. దీని మీద బీసీల నుంచి ఎపుడూ అసంతృప్తి పెల్లుబుకుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే దేశంలో కుల గణన జరగాలని కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం అందుకుంది. అది అచ్చం మూడున్నర దశాబ్దాల క్రితం నాటి జాతీయ నాయకుడు, దివంగత మాజీ పీఎం అయిన వీపీ సింగ్ అందుకున్న మండల్ ఉద్యమ నినాదంగా ఉంది. దేశంలో కుల గణన జరిపి ఆయా కులాలకు అవకాశాలు పెంచాలన్నది కాంగ్రెస్ స్టాండ్ గా ఉంది. ఒక విధంగా ఈ సామాజిక సమీకరణలను తమ వైపు తిప్పుకుని దేశంలో మరోసారి గట్టిగా నిలబడాలన్నది కాంగ్రెస్ ఆలోచన.

కుల గణన చేపట్టాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇక తాము అధికారంలో ఉన్న చోట్ల తామే ఆ పని చేపట్టాలని నిర్ణయించింది. ఆ విధంగా తెలంగాణాలో కాంగ్రెస్ అధికారం ఉన్న చోట కుల గణన సర్వే చేశారు. సహజంగా బీసీలు ఎక్కువగానే ఉన్నట్లుగా సర్వే తేల్చింది. ఇపుడు రెండోసారి కూడా సర్వే నిర్వహిస్తున్నరు. సర్వేలో పాల్గొనకుండా మిగిలిన వారి కోసం ఈ సర్వే జరుగుతోంది.

ఇదిలా ఉంటే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అయితే కుల గణన మీద కాంగ్రెస్ చిత్త శుద్ధిని చాటి చెబుతున్నారు. ఆయన తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కుల గణన జరగాలి. ఎవరు ఎంత ఏమిటి అన్నది తెలిస్తేనే వారికి అవకాశాలు వస్తాయి.బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటే రిజర్వేషన్ల కోటా కూడా వారికి పెంచేలా అత్యున్నత న్యాయ స్థానం కూడా పరిశీలించేందుకు అవకాశాలు ఉంటాయని అన్నారు.

తాను కుల గణనతో పాటు బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నాను అన్నారు. ఈ క్రమంలో తెలంగాణాకు తానే ఆఖరి చివరి రెడ్డి సీఎం అయినా తనకు అభ్యంతరం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. అంటే బీసీల జనాభాను బట్టి వారికి అధికార పీఠం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయిస్తే రెడ్డి సీఎం గా రేవంత్ రెడ్డి తప్పుకోవాల్సి వస్తుంది.

అయినా సరే బీసీల అభివృద్ధిని తమ నాయకుడు రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు కాబట్టి తాము కూడా దానికి సిద్ధమని ఆయన చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీలకు సీఎం పదవి అన్నది అందని పండు అయింది. ఈ క్రమంలో కుల గణన తెలంగాణాలో జరిగింది.

మరి దాని ప్రభావం కచ్చితంగా రాజకీయాల మీద ఉంటుంది. తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. మరి ఇది ఇక్కడితో ఆగదు. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే శాతంతో సీట్లు కావాలని డిమాండ్ చేస్తారు. అపుడు కచ్చితంగా కాంగ్రెస్ అయినా మరో పార్టీ అయినా ఎక్కువ మంది బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం ఖాయం. ఆ విధంగా చూస్తే తెలంగాణా నుంచి ఆ విధంగా తొలి బీసీ సీఎం అయ్యే అవకాశాలు సమీప భవిష్యత్తులో ఉండబోతున్నాయా అన్న చర్చకు తెర లేస్తోంది.

ఏపీలో చూస్తే కాపులకు సీఎం పదవి దక్కడం లేదన్న ఆవేదన ఉంది. ఆ దిశగా ఆ సామాజిక వర్గం 2024 ఎన్నికల్లో పోలరైజ్ అయింది. అది మరింతగా రానున్న ఎన్నికల్లో కనిపించనుంది. ఇక తెలంగాణాలో బీసీ నినాదం అధికారం దక్కాలని కోరుకున్నట్లు అయితే ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడుతుంది అని అంటున్నారు. దాంతో ఏపీలో కూడా రానున్న రోజులలో సామాజిక రాజకీయ సంచలనాలు నమోదు కాబోతాయా అన్నదే ఒక చర్చగా ఉంది.