Begin typing your search above and press return to search.

ఏపీలో కాదు.. తెలంగాణ అంతటా ‘కుల’కలం

తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కుల ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతారు. తెలంగాణలో కులానికి పెద్దగా పట్టింపు ఉండదని పేర్కొంటారు.

By:  Tupaki Desk   |   6 Feb 2025 3:30 PM GMT
ఏపీలో కాదు.. తెలంగాణ అంతటా ‘కుల’కలం
X

తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కుల ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతారు. తెలంగాణలో కులానికి పెద్దగా పట్టింపు ఉండదని పేర్కొంటారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యాయా? అన్నట్లు తెలంగాణలో తీవ్ర ‘కుల’కలం రేగుతుండడం గమనార్హం. దీనివెనుక పలు కారణాలు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా కులగణన.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నుంచి సాధారణ కార్యకర్త వరకు చెబుతున్న మాట. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని గట్టిగా ప్రకటించారు. ఈ మేరకే తెలంగాణలో కుల గణన సర్వేను నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక ఇటీవల ప్రభుత్వానికి అందింది. అయితే, బీసీల జనాభా తగ్గించారంటూ దీనిపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం 96.9శాతం (3.50 కోట్లు) మంది వివరాలు అందించారని చెబుతోంది.3.1 శాతం (16లక్షల మంది) మాత్రమే వివిధ కారణాల వల్ల వివరాలు ఇవ్వలేదని పేర్కొంటోంది. మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలు (3,54,77,554 జనాభా) నమోదు చేసినట్లు వివరించింది.

తెలంగాణలో ఎస్సీల జనాభా 17.43 శాతం, ఎస్టీల జనాభా 10.45 శాతం, బీసీల జనాభా 46.25 శాతంగా ప్రభుత్వం కుల గణన నివేదికలో వెల్లడించింది. ముస్లిం మైనారిటీల బీసీల జనాభా 10.08 శాతం, ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం అని పేర్కొంది. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం, రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం, రాష్ట్రంలో మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం అని వివరించింది.

తెలంగాణలో బీసీల జనాభా మొత్తం జనాభాలో సగం పేనే ఉంటుంది అనేది మొదటి నుంచి ఉన్న ఒక అంచనా. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం 46.25 శాతం తేలడంతో బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ముస్లిం మైనారిటీ బీసీల జనాభా 10.08 శాతం కలుపుకొంటేనే మొత్తం బీసీల జనాభా 56.33 శాతం అవుతోంది.

కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే కుల గణన నివేదికపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఆమోదించేది లేదని.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ (ఈడబ్ల్యూఎస్)ను కాపాడేందుకు బీసీ జనాభా తగ్గించి చూపుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

బీసీ వాయిస్ తో తీన్మార్ మల్లన్న మరోవైపు అగ్రవర్ణమైన రెడ్డిల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుండడంతో ఆయనను రెడ్డి సంఘాల మహిళలు తప్పుబడుతున్నారు.

ముస్లింలకు రిజర్వేషన్లను అప్పనంగా కట్టబెట్టడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణనలో బీసీ జనాభాలో కోతపెట్టిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ఆరోపిస్తున్నారు.

వర్గీక‘రణం’..

మూడు దశాబ్దాల పోరాటం అనంతరం ఎస్సీ వర్గీకరణకు ఆమోదం లభించింది. అయితే, దీనిని తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు ఆమోదించడం లేదంటూ వర్గీకరణ ఉద్యమానికి పునాది వేసిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద క్రిష్ణ మాదిగ ఆరోపించారు. చివరకు వర్గీకరణపై నివేదిక ఇవ్వాల్సిందిగా జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. రెండు నెలల పాటు కసరత్తు సాగించిన ఈ కమిషన్ తన నివేదికను సమర్పించింది. తర్వాత ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీనిపై మాల సంఘాల ఐకాస ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరిని ఖండిస్తోంది. 2011 జనాభా లెక్కల్లో ఉపకులాల గణన జరగలేదని, తప్పుడు లెక్కలతో వర్గీకరణ చేశారని మండిపడుతోంది. తెలంగాణ ఏర్పడిన 11 సంవత్సరాల తరువాత కూడా పాత లెక్కలను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తోంది.

9 కాదు 11 కావాలి..

ఎస్సీ వర్గీకరణలో మాదిగ సామాజిక వర్గానికి న్యాయంగా 11 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేస్తున్నారు. వర్గీకరణ అశాస్త్రీయంగా ఉందని, మాదిగ జనాభాను తగ్గిస్తూ స్వార్థపూరితంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. అడ్వాన్స్‌ కులాలను కూడా వర్గీకరణ గ్రూప్‌-1లో చేర్చారని అంటున్నారు. జనాభా ప్రాతిపదికన 15,27,143 మంది ఉన్న మాలలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తే.. మాదిగలు 32.33 లక్షల మంది ఉన్నందున.. 11 శాతం రిజర్వేషన్‌ రావాలని.. కానీ 9 శాతం ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.