సీఎం రేవంత్ స్విట్జర్లాండ్ నుంచి రాగానే చికాకు పెట్టేది ఇదే
సీఎం రేవంత్ స్విట్జర్లాండ్ టూర్ సమయంలో ఆయన్ను చికాకు పెట్టే పరిణామంగా కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మారిపోయాయి.
By: Tupaki Desk | 23 Jan 2025 2:00 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని బృందం దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో సరికొత్త రికార్డులు నెలకొల్పిందని.. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసిందని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా కాంగ్రెస్ పార్టీ సంతోషంగా పంచుకోవాల్సిన విషయమని తెలియజేస్తున్నారు. అయితే, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి పంటికింద రాయిలా మారే పరిణామాలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ స్విట్జర్లాండ్ టూర్ సమయంలో ఆయన్ను చికాకు పెట్టే పరిణామంగా కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మారిపోయాయి.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అత్యున్నత కార్యాలయమైన గాంధీ భవన్‌లో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. యూత్ కాంగ్రెస్ సమావేశంలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు పార్టీలో పదవుల కోసం ఏకంగా చొక్కాలు పట్టుకొని బాహాబాహీకి దిగారు. ఇరు వర్గాల నేతలు కొట్టుకున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆందోళనలు జరుపుతూ ఓ వర్గం నిరసన తెలుపుగా మరో వర్గం ప్రతిఘటించింది. పోలీసులు ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను చెదరగొట్టే వరకు పరిస్థితి చేరిపోయింది. కొత్తగూడెం కాంగ్రెస్ నేతలు చేసిన ఈ ఉద్రిక్త పరిస్థితుల ఉదంతం మరువక ముందే సరిగ్గా ఇలాంటి పరిస్థితే మరో ఎమ్మెల్యే విషయంలో ఎదురైంది.
హైదరాబాద్ సమీపంలోని పటాన్‌చెరులో ఊహించని రీతిలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు రచ్చగా మారాయి.పఠాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలంటూ పఠాన్ చేరు ప్రధాన రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టాయి. సేవ్ కాంగ్రెస్ పార్టీ... మహిపాల్ రెడ్డి డౌన్ డౌన్,భూ కబ్జాకోరి మహిపాల్ రెడ్డి గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను తగలపెట్టే క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉన్న గులాబీ కుర్చీలను పగలకొట్టి,కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో పెట్టడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి.
తమ ఆందోళనలపై పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు స్పందిస్తూ పాత బీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు. అసలైన కాంగ్రెస్ వాదులను అణిచివేస్తూ, పఠాన్ చేరులో కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ శ్రేణులు ఈ ఆందోళన చేపడుతున్నాయని తెలిపారు. దీంతో ఈ నియోజకవర్గం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. కాగా, ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేటలో ఉంటే మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇలా అంతర్యుద్దంలో పడిపోయారని చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ స్విట్జర్లాండ్ నుంచి రాగానే చికాకు పెట్టే అంశంగా పార్టీ రచ్చ మారిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.