Begin typing your search above and press return to search.

బుగ్గకారు భాగ్యం దక్కదా? పదవుల కోసం టీ.కాంగ్రెస్ నేతల ఆవేదన!

ఎన్నో ఆశలు..మరెన్నో ఊహలు..మంత్రి పదవి వస్తుందని కొందరు..నామినేటెడ్ పోస్ట్‌ కోసం ఇంకొందరు.. చాలా రోజులుగా కాంగ్రెస్ నేతలు వెయిట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Jan 2025 8:30 AM GMT
బుగ్గకారు భాగ్యం దక్కదా? పదవుల కోసం టీ.కాంగ్రెస్ నేతల ఆవేదన!
X

అంతనుకున్నామ్. ఇంత అనుకున్నామ్. అధికారంలోకి వస్తే తిరుగే ఉండదు..హవా చూపించొచ్చని ప్లాన్ చేసుకున్నాం. పార్టీ పవర్‌లోకి వచ్చి ఏడాదైంది. వన్‌ ఇయర్ పాలన కూడా పూర్తయింది. కానీ ఇంకా పదవి రాదాయే. బుగ్గ కారు యోగం లేకపాయే. ఇట్లైతే ఎట్లా అని సల్లబడిపోతున్నారట తెలంగాణ హస్తం పార్టీ నేతలు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో తెలియదు.. నామినేటెడ్‌ పోస్టుల ఊసేలేదు.. ఇదేం బాధరా అయ్యా అని తలలు పంటుకుంటున్నారట. కనీసం పీసీసీ కార్యవర్గం నియమించకపోవడంపై కాంగ్రెస్ నేతలు అధిష్టానంపై గుస్సా అవుతున్నారని అంటున్నారు.

ఎన్నో ఆశలు..మరెన్నో ఊహలు..మంత్రి పదవి వస్తుందని కొందరు..నామినేటెడ్ పోస్ట్‌ కోసం ఇంకొందరు.. చాలా రోజులుగా కాంగ్రెస్ నేతలు వెయిట్ చేస్తున్నారు. కానీ ఏడాదైనా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కొలిక్కి తేవడం లేదు. దీంతో పదవుల రేసులో ఉన్న నేతలకు రోజులు భారంగా గడుపుతున్నామని వాపోతున్నారు. అధికారంలో ఉన్నామని ఆనంద పడాలో..పదవి లేదని బాధపడాలో తెలియక పైకి మాత్రం హ్యాపీగానే ఉన్నట్లు కలరింగ్ ఇస్తున్నామని మదనపడుతున్నారు. పదవి లేకుండా గ్రామాల్లోకి వెళ్లి క్యాడర్‌, ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకోవాలంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.

తెల్లారి లేస్తే పార్టీ కోసం గళం విప్పుతున్నా.. చెప్పుకుందామంటే ఓ హోదా లేకపాయే ఇదెక్కడి బాధరా నాయనా అని ఫీల్ అవుతున్నారు హస్తం నేతలు. అట్లని బయటపడకుండా కవర్‌ చేసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. క్యాబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నా ఫుల్ ఫిల్ చేయడం లేదు. ముందు లోక్‌ సభ ఎన్నికలు అన్నారు.. తర్వాత దసరా, దీపావళి అంటూ వాయిదాలేశారు. ఇప్పుడు సంక్రాంతి కూడా వెళ్లిపోయినా పార్టీ పోస్టుల భర్తీపై ఎలాంటి కదలిక లేకపోవడంపై కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు.

ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణలు, ముఖ్యనేతల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల ఎప్పటికప్పుడు పదవుల భర్తీ వాయిదా పడుతోందని చెబుతున్నారు. ఇవన్నీ సర్దుకునేదెప్పుడు తమకు బుగ్గకారు భాగ్యం దక్కెదెప్పుడు? అంటూ మంత్రి పదవుల ఆశావహులు నిర్వేదం వ్యక్తం చేస్తుండగా, పార్టీ విజయం కోసం పనిచేశామని కనీసం కార్పొరేషన్ గిరీ కూడా దక్కడం లేదని సీనియర్లు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమైన నేతల ఇగో పంచాయితీ వల్ల చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ వంటి పదవులు కూడా భర్తీ కాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా 30కి పైగా నామినేటెడ్ పోస్టులను పెండింగులో పెట్టారు. ఇవన్నీ ఈ పాటికే భర్తీ చేస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ ఉత్సాహంగా పాల్గొని పార్టీకి గట్టిగా పనిచేసేవారని, అయితే పోస్టుల భర్తీపై అధిష్టానం ఏమీ తేల్చకపోవడంతో క్యాడరులో నిరుత్సాహం ఆవహించిందని చెబుతున్నారు.