Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల రహస్య భేటీ దుమారం! కండ కండాలుగా ఖండిస్తున్న ఎమ్మెల్యేలు

ఇంతకీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ జరిగిందా? లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

By:  Tupaki Desk   |   2 Feb 2025 8:30 AM GMT
ఎమ్మెల్యేల రహస్య భేటీ దుమారం! కండ కండాలుగా ఖండిస్తున్న ఎమ్మెల్యేలు
X

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్యభేటీ దుమారం రేపుతోంది. ఓ మంత్రికి వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు సీక్రెట్ గా సమావేశమయ్యారనే వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ భేటీకి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నేతృత్వం వహించారని, పది మంది వరకు హాజరైన ఎమ్మెల్యేలు మంత్రి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాము అలాంటి సమావేశాలు ఏమీ జరపలేదని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఖండిస్తున్నారు. ఇంతకీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ జరిగిందా? లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల భేటీ సమాచారం సంచలనం రేపింది. ఈ విషయంపై కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ స్పందించాయి. కాంగ్రెస్ లో అసమ్మతి మొదలైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం తమ ఎమ్మెల్యేల సమావేశమేమీ జరగలేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో సమావేశానికి వెళ్లారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సైతం స్పందిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను, మీడియా ప్రచారాన్ని ఖండిస్తున్నారు.

సమావేశానికి నేతృత్వం వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కూడా రహస్య భేటీ వార్తలపై రియాక్ట్ అయ్యారు. మీడియా అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, కానీ వక్రీకరించి వార్తలు రాయడం సబబు కాదని వ్యాఖ్యానించారు. తాము ఎలాంటి రహస్య సమావేశాలు నిర్వహించలేదని వివరణ ఇచ్చారు. ఒకవేళ సమావేశం జరిగినట్లు ఏ ఆధారం చూపినా తనపై చర్యలు తీసుకోవచ్చని సవాల్ విసిరారు. తాము రహస్యంగా కలిశామని వార్తలు ప్రచారం చేయడం సరైన చర్యకాదన్నారు. ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒక ఫేక్ ప్రచారాన్ని తెరపైకి తెస్తే, మీడియా, కొందరు యూట్యూబర్లు అదే అంశాన్ని హైలెట్ చేయడం భావ్యం కాదన్నారు.

ఇక ఇదే అంశంపై మరో ఎమ్మెల్యే నాయిని రాజేంద్రరెడ్డి కూడా స్పందించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని చెప్పడానికి ఈ ప్రచారమే నిదర్శనమన్నారు. కుట్ర వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని నాయిని హెచ్చరించారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివరణ ఇస్తామని నాయిని రాజేంద్రరెడ్డి వివరించారు.

సమావేశం జరగలేదంటూనే ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడంపై రాజకీయ పరిశీలకులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిప్పులేనిదే పొగురాదు కదా అంటున్నారు. మరోవైపు ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. రహస్య భేటీ జరిగిందా? లేదా? ఎందుకు పది మంది ఎమ్మెల్యేలు ఒకేచోట చేరాల్సివచ్చిందన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను సతాయిస్తున్న మంత్రి ఎవరన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.