Begin typing your search above and press return to search.

రాములమ్మ ఎవరి కోటా? కాంగ్రెస్ అనూహ్య నిర్ణయానికి కారణమేంటి?

అయితే విజయశాంతి నేరుగా హైకమాండ్ కోటా నుంచే ఎమ్మెల్సీగా ఎంపికయ్యారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

By:  Tupaki Desk   |   12 March 2025 8:00 AM IST
రాములమ్మ ఎవరి కోటా? కాంగ్రెస్ అనూహ్య నిర్ణయానికి కారణమేంటి?
X

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎంపికలో కాంగ్రెస్ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకోవడం చర్చకు దారితీస్తోంది. ఎవరి అంచనాల్లోనూ లేని ఫైర్ బ్రాండ్ విజయశాంతి బీసీ మహిళ కోటాలో ఎమ్మెల్సీ సీటును తన్నుకుపోవడం హస్తం పార్టీలో సీనియర్లకు షాక్ ఇచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్ లో ఢిల్లీ, లోకల్, సీనియర్స్, సీఎం అంటూ చాలా కేటగిరీలు ఉంటాయని, మరి విజయశాంతి ఏ కేటగిరీలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారనేదానిపైనే కార్యకర్తలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను కాంగ్రెస్ తన బలంతో 4 స్థానాలను గెలిపించుకునే అవకాశం ఉంది. ఇందులో ఒకటి మిత్రపక్షం సీపీఐకి ఇవ్వడంతో ఇంకా మూడు స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆ మూడు సీట్లు కేటాయించింది. ఎస్సీ కోటాలో ఎంపికైన అద్దంకి దయాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరుంది. అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులు ఇలా 15 నెలలుగా ఆయన త్యాగాలు చేస్తూ ఉండటంతో ఈ సారి ఆయనకు తప్పక అవకాశం ఇవ్వాల్సివచ్చిందని అంటున్నారు. అదేవిధంగా సీనియర్ నేతగా, ఎస్టీ కేటగిరీలో నల్లొండ నేతల సిఫార్సులతో శంకర్ నాయక్ పేరు సిఫార్సు చేశారు. ఈ సీటు లోకల్ కోటాగా పరిగణిస్తున్నారు. ఇక మిగిలిన రెండు కేటగిరిలో రాములమ్మ విజయశాంతి ఏ కేటగిరీ కింద ఎమ్మెల్సీ కైవసం చేసుకున్నారనేది కాంగ్రెస్ కేడర్ కు అంతుచిక్కడం లేదు.

గత ఎన్నికల ముందే కాంగ్రెస్ లోకి వచ్చిన విజయశాంతి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఆమె కాస్త సైలెంటుగానే ఉంటున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. అయితే అనూహ్యంగా ఆమెను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తెచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. పార్టీతో టచ్ లో ఉండీ లేనట్లు ఉన్న విజయశాంతికి ఎవరి సిఫార్సుతో ఎమ్మెల్సీ సీటు దక్కిందనేది ఎవరికీ అంతుచిక్కడం లేదంటున్నారు.

అయితే విజయశాంతి నేరుగా హైకమాండ్ కోటా నుంచే ఎమ్మెల్సీగా ఎంపికయ్యారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ముందు పార్టీలో చేరినప్పుడే విజయశాంతికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని, పైగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ రంగంతో కొంత పెరిగిందనే ప్రచారం నేపథ్యంలో అనూహ్యంగా రాములమ్మ పేరు తెరపైకి వచ్చిందని చెబుతున్నారు.