Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మార్క్ రాజకీయం.. అర్థమవడమే కష్టం

కాంగ్రెస్ ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ. 200 ఏళ్ల చరిత్ర. దేశం కోసం త్యాగాలు అంటూ ఆ పార్టీ నేతలు ఏవేవో గొప్పలు చెబుతుంటారు.

By:  Tupaki Desk   |   8 March 2025 12:39 PM IST
కాంగ్రెస్ మార్క్ రాజకీయం.. అర్థమవడమే కష్టం
X

కాంగ్రెస్ ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ. 200 ఏళ్ల చరిత్ర. దేశం కోసం త్యాగాలు అంటూ ఆ పార్టీ నేతలు ఏవేవో గొప్పలు చెబుతుంటారు. కానీ, క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఆ పార్టీ నిలదొక్కుకోవడమే సవాల్ గా మారుతోంది. అధికారం చేతిలో ఉండి కూడా సిట్టింగు స్థానాలను నిలబెట్టుకోవడంలో హస్తం నేతలు ఆపసోపాలు పడుతున్నారు. నిజానికి సులువుగా గెలిచే స్థానంలో కాంగ్రెస్ మార్కు రాజకీయం ఎక్కువవడం వల్లే చేజేతులా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సివచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా, ఉత్తర తెలంగాణ పట్టభద్ర ఎమ్మెల్సీ గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుకోల్పోవడం వేడి పుట్టిస్తోంది. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్స్ మోగినట్లేనని విశ్లేషిస్తున్నారు.

నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమే శాపం అంటున్నారు విశ్లేషకులు. ఏ పార్టీకి లేనంతమంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ సీనియార్టీయే హస్తం పార్టీకి నష్టం చేస్తుందని అంటున్నారు. అంతేకాకుండా అంతర్గత స్వేచ్ఛ అనే విచ్చలవిడితనం కూడా కాంగ్రెస్ పునాదులను కదిలించేస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనను పరిశీలిస్తే.. ఆ పార్టీ విజయాలను కూడా చెప్పుకోలేకపోతోందని అందుకే ప్రజల్లో సానుకూల అభిప్రాయం సాధించలేకపోతోందని అంటున్నారు. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంగీకరించడం విశేషంగా చెబుతున్నారు. పార్టీలో సీనియర్లకు అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం.. వారిని కట్టడి చేయలేకపోతున్నారంటున్నారు. అందుకే మంచిని చెవిలోనూ.. చెడును మైకులోను చెబుతున్నారని అంటున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయాలను పరిశీలిస్తే స్వపక్షంలోనే విపక్షంగా పనిచేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని అంటున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న నేతలతోపాటు కొత్తగా వచ్చిన వారితోనూ గ్రూపు గొడవలు ఎక్కువవుతున్నాయి. అత్తెసరు స్కోరుతో అధికారంలో కొనసాగుతున్నామన్న సోయి లేకుండా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తుండటం వల్ల రానురాను ఆ పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారుతోందని అంటున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహకరణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమే అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగిస్తున్న పట్టభద్రుల్లో సానుకూలత పొందలేకపోవడానికి కారణం కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలే అంటున్నారు. ఉత్తర తెలంగాణ పట్టభద్ర ఎమ్మెల్సీగా కాంగ్రెస్ తరఫున పోటీచేసిన అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 6 నెలలుగా నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించిన నరేందర్ రెడ్డి.. పార్టీలో అనైక్యతే తన ఓటమికి కారణమైందని భావిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరి మధ్య విభేదాలు ఉన్నాయో పూర్తిగా వివరిస్తూ ఆయన పార్టీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ కు నివేదించనున్నట్లు చెబుతున్నారు.

పార్టీలో భస్మాసుర హస్తాలు ఎక్కువ అవడం వల్లే కాంగ్రెస్ పార్టీ పరపతి పోతోందని విశ్లేషకులు అంటున్నారు. పది మంది ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం, వలస ఎమ్మెల్యేల సెపరేట్ మీటింగులు, ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలు విమర్శలు ఇలా చెప్పుకుంటూపోతే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువైపోవడం, నేతలపై ప్రభుత్వ పెద్దలకు పట్టులేదనే సంకేతాలు పంపుతోంది. దీంతో కార్యకర్తలు కూడా నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు నడుచుకోవడంతో పార్టీ నష్టపోవాల్సివస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఓ కీలక మంత్రి ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలను కలుపుకొని వెళ్లడం లేదని అంటున్నారు. ఆయన తీరు వల్లే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో భారీగా ఓట్లు కోల్పోవాల్సివచ్చిందని ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి నివేదిక రెడీ చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు కాంగ్రెస్ నష్టాలకు ఆ పార్టీ నేతలే కారణమవుతున్నారనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది.