Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీలో ఆ పోస్టుకు గిరాకీ ఫుల్ !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ పదవికి ఇప్పుడు పార్టీలో ఫుల్ డిమాండ్ పెరిగింది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 9:30 AM GMT
కాంగ్రెస్ పార్టీలో ఆ పోస్టుకు గిరాకీ ఫుల్ !
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ పదవికి ఇప్పుడు పార్టీలో ఫుల్ డిమాండ్ పెరిగింది. బాబ్బాబు ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా ఫరవాలేదు. కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అయినా ఇప్పించండి అంటూ ఢిల్లీ పెద్దలను, పార్టీ మంత్రులను బతిమాలుతున్నారట. ఎలాగయినా ఆ పోస్టు ఇప్పించాలని కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ తిరుగుతున్నారట.

తెలంగాణ, ఏపీ విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కొత్తగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును సృష్టించారు. మొదట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత పీసీసీ చీఫ్ పదవి పొంది దాదాపు ఏడేళ్లపాటు పనిచేసి ఢిల్లీ పెద్దలతో దగ్గరి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా, కాంగ్రెస్ పెద్దలకు సన్నిహితుడిగా ముద్రపడ్డాడు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు మంత్రిపదవుల భర్తీ విషయంలో ఉత్తమ్ వాదన మేరకే పార్టీ పక్కన పెట్టడం విశేషం.

ఇక ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన మల్లు భట్టి విక్రమార్క ఆ తర్వాత ప్రచార కమిటీ చైర్మన్ గా, సీఎల్పీ లీడర్ గా పనిచేసి ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు.

రేవంత్ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఆర్గనైజేషన్ ఇంఛార్జ్ గా పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేసిన పొన్నం ప్రభాకర్ ఇప్పుడు రవాణా మంత్రిగా పనిచేస్తున్నాడు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారి దశ - దిశ మారిపోవడంతో ఇప్పుడు ఈ పోస్టుకు గిరాకీ పెరిగింది.