Begin typing your search above and press return to search.

గీత దాటిన కాంగ్రెస్ నేతలపై వేటు.. ఎమ్మెల్సీ మల్లన్నపై యాక్షన్ ఉంటుందా?

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లివచ్చాక అధిష్టానంలో వచ్చిన మార్పుతో నేతల నోళ్లకు తాళాలు పడుతున్నాయంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Feb 2025 6:30 PM GMT
గీత దాటిన కాంగ్రెస్ నేతలపై వేటు.. ఎమ్మెల్సీ మల్లన్నపై యాక్షన్ ఉంటుందా?
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రూటు మార్చింది. ఇంటర్నల్ డెమొక్రసీ పేరుతో పార్టీ క్రమశిక్షణను తప్పుతున్న నేతలపై చర్యలకు సిద్ధమంటోంది. మాట వింటే ఓకే.. వినకపోతే వేటు అంటూ సంకేతాలు పంపుతోంది. ఇప్పటికే ఓ నేతను బయటకి పంపగా, మరికొందరి పేర్లతో లిస్టు రెడీ అయిందంటున్నారు. ఎవరికి తోచింది వారు మాట్లాడుతూ.. రోడ్డెక్కుతామంటే గతంలో బుజ్జగింపులు ఉండవని హెచ్చరిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లివచ్చాక అధిష్టానంలో వచ్చిన మార్పుతో నేతల నోళ్లకు తాళాలు పడుతున్నాయంటున్నారు.

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటోంది తెలంగాణ పీసీసీ. కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో బోలెడంత స్వేచ్ఛ. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించే నేతలు.. అధిష్టానం సడన్ వార్నింగుతో మారుతారా? అనేది ఆసక్తి రేపుతోంది. పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరైనా ఉపేక్షించేది లేదని అధిష్ఠానం తేల్చిచెబుతోంది. శాంపిల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఇన్ చార్జి సుభాష్ రెడ్డిపైనే వేటు వేసింది. మారకపోతే మరికొంత మందిపై వేటు పడటం ఖాయమని గాంధీభవన్ లో వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అంతర్గత కుమ్ములాటలు ఎక్కువే. గత ఎన్నికలకు ముందు పార్టీలో గ్రూప్ వార్ పతాకస్థాయిలో ఉండేది. అయితే ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. సీనియర్లు అంతా సిన్సియర్ గా పనిచేయడంతో గెలుపు గాంధీభవన్ వాకిట వాలింది. ఇక అధికారంలో వచ్చాక షరా మామూలే అన్నట్లు మళ్లీ గ్రూపుల గొడవ ఎక్కువవుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒక నేత తీసుకున్న నిర్ణయాన్ని మరో నేత తప్పుపట్టడం రివాజుగా మారింది. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఈ సమస్య మరింత తీవ్రంగా కలవరపెడుతోందని అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ తలనొప్పిగా ఎక్కువగా ఉంది. మరోవైపు పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా కొందరు మాట్లాడటంతో సోషల్‌ మీడియాలో ట్రోల్స్, పబ్లిక్‌లోకి నెగెటివ్‌ టాక్ వస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించినట్లు చెబుతున్నారు.

ఈ మధ్యకాలంలో కొందరు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ విధానాలపై చేస్తున్న విమర్శలు ప్రతిపక్షాలకు అస్త్రాలు అవుతున్నాయి. సొంత పార్టీ నేతలే ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నారు. మరికొన్ని చోట్ల గ్రూపు తగాదాలతో రచ్చ నడుస్తుంది. ఇవన్ని పార్టీకి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా పది మంది ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ పార్టీలో అగ్గిరాజేసింది. దీంతో ఇంటర్నల్ ఇష్యూస్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం ఫోకస్ పెంచింది. ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలోనూ ఈ అంశంపై సీరియస్‌గా చర్చించారు. ఇకపై పార్టీ గీత దాటితే వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించొద్దని, డౌట్స్‌ ఉంటే ఉంటే పార్టీ ఇంటర్నల్ వేదికలపై చర్చించాలని సూచించారు. బహిరంగంగా మాట్లాడి పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు తేవొద్దని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటితే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని, పార్టీ క్రమశిక్షణ సంఘం ఈ విషయంలో అలర్ట్‌గా ఉండాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించడంతో పార్టీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.

ఈ క్రమంలనే సమస్య తీవ్రత గుర్తించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ మధ్య పలువురికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గ కీలక నేత సుభాష్ రెడ్డి..ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావుపై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో సుభాష్ రెడ్డి అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. సుభాష్ రెడ్డి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి వర్గంగా ముద్రపడిన సుభాష్‌రెడ్డిపై ఆల్ అఫ్ సడెన్‌గా పార్టీ బహిష్కరణ వేటు వేయడం గాంధీభవన్‌లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ లైన్ దాటితే ఎవరైనా..ఎంతటి వారైనా వదిలేదని చెప్పేందుకే తన అనుచరుడిపై ముందుగా సీఎం వేటు వేశారని అంటున్నారు. దీంతో ఇన్నాళ్లు వాయిస్ పెంచి మాట్లాడిన నేతలు సైలెంట్ అవుతున్నారని గాంధీ భవన్ వర్గాల సమాచారం.

ఇక ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, కరీంనగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్ కు క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా గాంధీభవన్‌లో గొడవ పడిన యూత్ కాంగ్రెస్ నేతలలో కొందరికి నోటీసులు జారీ అయ్యాయంటున్నారు. వీరంతా ఇచ్చే సమాధానంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ మల్లన్న ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తి రేపుతోంది. పార్టీ ఆదేశాలను పాటించి వివరణ ఇస్తారా? లేక తన స్వతంత్రతను కొనసాగిస్తారా? అనేది చూడాల్సివుంది. ఏదిఏమైనా కాంగ్రెస్ అధిష్టానం తీరు చూస్తే ఇకపై కఠిన నిర్ణయాలు ఉంటాయనే సంకేతాలే అందుతున్నాయంటున్నారు.