Begin typing your search above and press return to search.

నిత్యావసరాల ధరల్లో తెలంగాణ టాప్.. కేంద్రం నివేదికలో సంచలన నిజాలు

రోజులు పెరుగుతున్న కొలదీ మనిషి జీవితం మరింత భారంగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో కుదేలవుతున్నాడు.

By:  Tupaki Desk   |   18 Sep 2024 7:06 AM GMT
నిత్యావసరాల ధరల్లో తెలంగాణ టాప్.. కేంద్రం నివేదికలో సంచలన నిజాలు
X

రోజులు పెరుగుతున్న కొలదీ మనిషి జీవితం మరింత భారంగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో కుదేలవుతున్నాడు. నిత్యావసరాల నుంచి మొదలు వైద్యం, విద్య ఖర్చులు నిత్యం మనిషిని పట్టిపీడిస్తున్నాయి. అయితే.. దేశవ్యాప్తంగా ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే ఆ ధరలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువట. కేంద్రం విడుదల చేసిన నివేదికలోనే ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి.

కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్-సీపీఐ 2024ను తాజాగా కేంద్రం విడుదల చేసింది. ఆగస్టు నివేదికలో వెల్లడించిన అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయి. 201.6 సీపీఐతో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామాల నుంచి ధరలను సేకరించారు. వాటి ద్వారా వినియోగదారుల ధరల సూచిక, వినియోగదారుల ఆహార సూచిక నివేదికను విడుదల చేశారు. సరుకుల వారీగా, రాష్ట్రాల వారీగా కేంద్రం ఈ జాబితా వెలువరించింది.

జాబితాలో పేర్కొన్న ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో కూరగాయలు, పప్పుల ధరలు పైపైకి చేరాయని పేర్కొంది. అలాగే.. 2023 ఆగస్టుతో పోల్చితే 2024 ఆగస్టు మాసంలో దేశంలో మాంసం, చేపలు, సుగంధ ద్రవ్యాల ధరల ద్రవ్యోల్బణం తగ్గినట్లుగా పేర్కొంది. అయితే.. అన్ని రకాల నిత్యావసర ద్రవ్యోల్బణం 3.65 శాతం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే.. మణిపూర్, త్రిపురలాంటి ఈశాన్య ప్రాంతాల్లో మారుమూలకు ఉన్న రాష్ట్రాలకు రవాణా చార్జీల వల్ల ధరలు పెరుగుతున్నాయంటే ఒక అర్థం ఉంది. కానీ.. సారవంతమైన భూముల, సమృద్ధిగా వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏకంగా దేశంలోనే అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగించే అంశం.

మొత్తం 22 ప్రధాన రాష్ట్రాల వివరాలను కేంద్రం వెల్లడించింది. వీటిలో 201.6తో తెలంగాణ రాష్ట్రం టాప్ ప్లేసులో ఉండగా.. జమ్ము 200.1, కేరళ 198 పాయింట్లతో తదుపరి వరుసలో నిలిచాయి. అయితే.. ఆగస్టు 2023లో 197.6 పాయింట్లతో 22 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉండగా.. ఈ సారి కూడా అదే స్థానాన్ని కొనసాగించింది. దాంతో తెలంగాణలో ప్రజల బతుకు భారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.