ENO తాగండి.. జండూబామ్ రాసుకోండి.. టీ.పాలిటిక్స్ డైలాగ్ వార్
బీఆర్ఎస్.. ప్రజల చేతిలో దెబ్బలు తిన్న కాంగ్రెస్ వారి కోసం జెండూ బామ్, జిందా తిలిస్మాత్ పంపుతున్నామని ప్రకటించింది.
By: Tupaki Desk | 26 Jan 2025 5:37 AM GMTతెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పొలిటికల్ ఇంట్రెస్టింగ్ పుట్టిస్తోంది. గత కొన్నేళ్లుగా రోత భాషతో ఆరోపణలు, ప్రత్యారోపణలతో తిట్టుకునే నేతలు ప్రస్తుతం హుందా వ్యాఖ్యలతో విమర్శలకు దిగడంపై ఆశ్యర్యం వ్యక్తమవుతోంది. చాలా కాలం తర్వాత వినసొంపైన భాష ప్రయోగిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
దావోస్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భజన బృందం అదరగొట్టిందని రాష్ట్రానికి లక్షా 78 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిందని ప్రభుత్వ వర్గాలు పొంగిపోతున్నాయి. ఈ విజయాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, వారి కోసం ENO కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అంతేకాకుండా హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ బ్యానర్లు పెట్టారు. అదే సమయంలో ENO తాగండంటూ ప్రతిపక్షాన్ని ఉద్దేశించి హోర్డింగులు ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఈ హోర్డింగులు, బ్యానర్లు ఆసక్తి పుట్టించాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రి తెచ్చిన పెట్టుబడులపైనా పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేశాయి. దీంతో వీటికి కౌంటరుగా బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్న కాంగ్రెస్ నేతలకు గ్రామసభల్లో ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవుతోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. ప్రజల చేతిలో దెబ్బలు తిన్న కాంగ్రెస్ వారి కోసం జెండూ బామ్, జిందా తిలిస్మాత్ పంపుతున్నామని ప్రకటించింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ గుంపు మేస్ట్రీ కంపునోటిని కడుక్కోడానికి హర్పిక్ కూడా పంపుతున్నామని ప్రకటనలిచ్చింది. దీంతో ఇరుపక్షాల మధ్య డైలాగ్ వార్ పతాకస్థాయికి చేరింది.
గత కొన్నేళ్లుగా తెలంగాణలో ఈ తరహా విమర్శలు కనుమరుగయ్యాయి. నేతలు పరస్పర దూషణలు, వ్యక్తిత్వ హననానికి దిగడంతో ప్రజలు నేతల భాషపై యావగించుకునే పరిస్థితి నెలకొంది. అయితే చాలా కాలం తర్వాత ప్రస్తుతం కాస్త వినసొంపైన భాషలో వ్యంగ్యాస్త్రాలు సంధించుకోవడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. యాదృచ్ఛికంగా అయినా ఇరుపార్టీలు హాస్యాన్ని రంగరించి రాజకీయ విమర్శలు చేసుకోవడం స్వాగతించాల్సిన విషయమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.