రైతుబంధుపై మంత్రి క్లారిటీ.. కేవలం వారికి మాత్రం సాయం
రైతులకు పెట్టుబడి సాయం కోసం తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసింది.
By: Tupaki Desk | 20 Sep 2024 5:46 AM GMTరైతులకు పెట్టుబడి సాయం కోసం తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా ఏటా ఎకరాకు రూ.10 వేల చొప్పున అందించింది. అయితే.. ఎకరం నుంచి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ వారందరికీ సాయం అందించింది. సన్న, చిన్నకారు రైతుల నుంచి వందలాది ఎకరాలు ఉన్న వారికి కూడా ఆ సాయం చేరింది. ఆ పథకం ద్వారా పేద రైతుల కంటే బడా రైతులే చాలా వరకు లాభ పడ్డారని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ ఆరోపిస్తూ వచ్చింది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రైతుబంధును రైతుభరోసా పేరిట కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను రూపొందించింది. బీఆర్ఎస్ ఇస్తున్న రూ.10వేలు కాకుండా రూ.15వేలు ఎకరాకు అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు అయింది. తాజాగా.. ఈ పథకం అమలుపై కసరత్తు చేస్తోంది. అయితే.. ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అమలు చేసిన ఈ పథకంలో పలు రకాల నిబంధనలు అమలు చేయబోతోంది.
ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రైతుభరోసాపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కేవలంలో పంట వేసే రైతులకే రైతు భరోసా రూపంలో సాయం అందిస్తామని ప్రకటించారు. అలా చేయడమే న్యాయమని రైతుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉందని చెప్పారు. ఇటీవల సబ్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలు కోరిందని.. రైతుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.
గత ప్రభుత్వం కొండలు, గుట్టలు, రాళ్లురప్పలు ఉన్న భూములకు కూడా రైతుబంధు ఇచ్చిందని.. దాని వల్ల కోట్ల రూపాయలు వృథా అయ్యాయని చెప్పారు. అందుకే.. తాము మాత్రం సాగులో ఉన్న భూములకే ఈ సాయం అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే రైతుల అకౌంట్లలో రైతభరోసా డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు.