రేవంత్ రెడ్డి ఇంటింటికీ ఎంత ఇస్తున్నాడంటే?
వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో వరదల పోటెత్తాయి.
By: Tupaki Desk | 9 Sep 2024 5:34 AM GMTవారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో వరదల పోటెత్తాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఆ నష్టం భారీగా సంభవించింది. చాలా కుటుంబాలు ప్రజలు సర్వస్వం కోల్పోయారు. ఇళ్లలోని వస్తువులు వరద పాలయ్యాయి. ఇంటి నిండా బురద నిండిపోయింది. పశువులను సైతం కాపాడుకోలేకపోయారు. వరద తగ్గాక వెళ్లి చూస్తే భీతావహ వాతావరణమే కనిపించింది.
ఇప్పటికే వరద ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు పర్యటించారు. ఇప్పటికీ ఇంకా పర్యటిస్తూనే ఉన్నారు. అలాగే.. కేంద్రం నుంచి కూడా కేంద్ర మంత్రి వచ్చి జరిగిన నష్టంపై ఏరియల్ సర్వే చేశారు. సుమారు.. 5 వేల కోట్లకు పైగా భారీ నష్టం సంభవించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
అయితే.. ప్రత్యక్షంగా వెళ్లి బాధితుల బాధలు విన్న రేవంత్ రెడ్డి వారి కోసం కుటుంబానికి రూ.10వేల సాయం చేస్తామని ప్రకటించారు. ఆ సహాయం సరిపోదని ముఖ్యమంత్రి భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే.. వరద సాయం మరింత పెంచాలని భావిస్తున్నారట.
ఇప్పటికే వరద బాధితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారం సాయం అందిస్తే బాధితులకు మరింత మేలు జరగనుంది. గతంలో ఇంటింటికీ ఇస్తామన్న రూ.10 వేలను రూ.17,500కు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటి మరమ్మతుల కోసం రూ.6,500, దుస్తుల కోసం రూ.2,500, వస్తువులకు రూ.2,500, కూలీ కింద రూ.6,000 కలిపి మొత్తంగా రూ.17,500 ఇవ్వనున్నట్లు సమాచారం.