ప్రజల కోసం రేవంత్ వినూత్న నిర్ణయం.. దాని వల్ల ఉపయోగం ఏంటి..?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో ఆధార్ పేరిట కార్డులను తీసుకొచ్చింది.
By: Tupaki Desk | 23 Sep 2024 3:30 PM GMTకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో ఆధార్ పేరిట కార్డులను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతీ దానికి ఆధార్ కార్డును లింక్ చేశారు. ప్రతీ పథకానికీ ఆధార్‌తోనే ముడిపెట్టారు. ఇప్పుడు మన జీవితానికి అదే పెద్ద ఐడెంటిటి అయిపోయింది. ఇప్పుడు ఏ చిన్న పనికి అయినా ఆధార్ ప్రామాణికంగా మారింది. ఆధార్ లేనిదే ఏ పని కూడా అవ్వదు.
తెలంగాణ రాష్ట్రంలో పది నెలల క్రితం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు, పాలనపైనే ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కట్ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ కార్డు వలే రాష్ట్రంలోనూ అలాంటి వినూత్న ప్రయోగానికి రేవంత్ ఆలోచన చేశారు. సరికొత్త విధానంతో అర్హులైన వారికే ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఇందుకోసం ప్రజలకు డిజిటల్ కార్డులు అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్డు ద్వారా కేవలం సంక్షేమ పతకాలకే కాకుండా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ అనుసంధానం చేయబోతోంది. ఇటీవల రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు. ఆయన సన్మానం సందర్భంగా కాంగ్రెస్ శాసనసభా పక్షం ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా ఈ రేవంత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధానంగా ప్రజల కోసం డిజిటల్ కార్డులు తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్డును ప్రజల కోసం అమలయ్యే ప్రతీ కార్యక్రమానికి ఈ కార్డును అనుసంధానిస్తారు. భవిష్యత్తులో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, కల్యాణ లక్ష్మి అన్ని కూడా ఈ కార్డు ద్వారానే ఇవ్వబోతున్నారు. అయితే.. ఈ డిజిటల్ కార్డుతో పాటే హెల్త్ కార్డును కూడా అందించబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతీ పర్సన్‌కు ఈ కార్డును అందించనున్నారు. ఇక హెల్త్ కార్డులో ప్రతీ ఒక్క వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఏదేని వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే ఆ హెల్త్ కార్డు ఆధారంగా ఆయనకు ట్రీట్‌మెంట్ అందించనున్నారు.