Begin typing your search above and press return to search.

రేవంత్ సర్కారు దూకుడు.. కేసీఆర్ కేసు? అమెరికాకు వెళ్లలేరిక..?

అయితే, వీటిలో అక్రమాలు జరిగాయంటూ రేవంత్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు జస్టిస్‌ మదన్‌ భీంరావు లోకూర్‌ కమిషన్‌ ను విచారణకు నియమించింది.

By:  Tupaki Desk   |   17 Dec 2024 9:07 AM GMT
రేవంత్ సర్కారు దూకుడు.. కేసీఆర్ కేసు? అమెరికాకు వెళ్లలేరిక..?
X

కేటీఆర్ ను ఫార్ములా- ఈ కార్ రేసులో బుక్ చేస్తున తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేయబోతోంది.. ఈసారి ఏకంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కేసులో బుక్ చేయనుంది. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న విద్యుత్తు ఒప్పందాలపై మొదటినునంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే వాటినే లక్ష్యంగా చేసుకుంది. ఇక కేసీఆర్ సర్కారు యాదాద్రి, భద్రాద్రి పేరిట విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం చేపట్టారు. అయితే, వీటిలో అక్రమాలు జరిగాయంటూ రేవంత్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు జస్టిస్‌ మదన్‌ భీంరావు లోకూర్‌ కమిషన్‌ ను విచారణకు నియమించింది.

జస్టిస్ లోకూర్ నివేదికకు ఓకే..

తాజాగా జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికను తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. దీంతో విద్యుత్తు నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌, ఇతర పాత్రధారులపై చర్యలకు సర్కారు నిర్ణయించింది. అంతేగాక ఈ జస్టిస్ లోకూర్ నివేదికను శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని తీర్మానించింది. సభలో విస్తృతంగా చర్చించాక కేసీఆర్‌ పై తీసుకునే చర్యలను అసెంబ్లీలోనే ప్రకటించనుంది. అనంతరం కేసీఆర్‌ సహా పలువురిపై ప్రభుత్వం కేసు పెడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గమనార్హం ఏమంటే.. సీఎం రేవంత్ అధ్యక్షతన సోమవారం 5 గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. విద్యుత్తు కమిషన్‌ నివేదికపైనే సుదీర్ఘంగా చర్చించారు.

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్‌ నిర్ణయాలు డిస్కమ్‌ లను ఆర్థికంగా కుప్పకూల్చాయని.. అయినా అధికారులు కేసీఆర్ మెప్పు కోసం తలూపారనే ఆరోపణలున్నాయి.

ఫలితంగా విద్యుత్తు కొనుగోళ్లు, పవర్‌ ప్లాంట్ల నిర్మాణంలో 25 ఏళ్లలో తెలంగాణ మూల్యం చెల్లించుకోనుందని తేల్చింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ తో రూ.9 వేల కోట్ల దాకా ప్రజలపై భారం పడుతుందని తెలంగాణ క్యాబినెట్ పేర్కొంది.

ఇక ఛత్తీస్ గఢ్‌ విద్యుత్తు కొనుగోలు ఒప్పందంతో రూ.3,642 కోట్ల నష్టం జరిగిందని జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక తేల్చింది. దీనిపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది.

శ్వేతపత్రం విడుదల చేసి మరీ..

రేవంత్ ప్రభుత్వం వస్తూనే.. తెలంగాణలో విద్యుత్తు రంగంపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసింది. దీంతో విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్‌ శాసన సభ్యులు సవాల్‌ విసిరారు. ఆ మేరకు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. మార్చి 14న జస్టిస్‌ ఎల్‌.నర్సింహా రెడ్డి నేతృత్వంలో కమిషన్‌ ను నియమించింది. విచారణ నివేదిక ఇస్తారనే క్రమంలో సుప్రీం కోర్టు తీర్పుతో జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి తప్పుకొన్నారు. దీంతో జూలై 29న జస్టిస్‌ లోకూర్‌ కమిషన్‌ ను వేశారు. ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లనుంది.

మరి అమెరికా టూరో?

త్వరలో కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్తారనే కథనాలు వచ్చాయి. కానీ, ఇప్పుడు కేసు నమోదైతే ఎలా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.