'నెయ్యి' విధానంపై తెలంగాణను ఫాలో అయితే మంచిది బాబు
తెలంగాణ వ్యాప్తంగా అధిక శాతం దేవలయాల్లోని లడ్డూలు.. ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిపై కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
By: Tupaki Desk | 26 Sep 2024 4:03 AM GMTశ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీకి అవసరమైన ఆవునెయ్యి కొనుగోలుపై తిరుమల తిరుపతి దేవస్థానం అనుసరిస్తున్న పాత కాలం విధానాల్ని చాప చుట్టేసి విసిరేయాల్సిన సమయం వచ్చిందా? అంటే..అవునని చెప్పాలి. ఇప్పటివరకు పోటీతో ప్రైవేటుకు పెద్ద పీట వేస్తున్న వైనం తెలిసిందే. ఆవునెయ్యి తయారీలో జంతు కొవ్వు వినియోగ వ్యవహారం వెలుగు చూడటం.. పెద్ద వివాదంగా మారటం తెలిసిందే. ఇలాంటి వేళ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రియాక్టు అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా అధిక శాతం దేవలయాల్లోని లడ్డూలు.. ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిపై కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
దీని ప్రకారం.. ఇప్పటివరకు టెండర్ల పేరుతో ప్రైవేటు సంస్థలకు పెద్దపీట వేసే విధానానికి మంగళం పాడేశారు. ఇన్నాళ్లు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కాకుండా ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేసే తీరుకు భిన్నంగా.. ఇకపై ప్రభుత్వ సంస్థ అయిన విజయ డెయిరీ నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అంతేకాదు.. ప్రభుత్వ సంస్థల్ని వదిలేసి.. ప్రైవేటు వద్ద కొనుగోళ్లు చేయటంపైనా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
టెండర్లతో పని లేకుండా ఇకపై ఆలయాల్లో విజయ నెయ్యినే వినియోగించాలంటూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటివరకు అనుసరించిన విధానం ప్రాకరం ఏటా కోటి రూపాయిలకు పైగా ఆదాయం ఉన్నా దేవాలయాలు తెలంగాణ వ్యాప్తంగా 12 ఉంటే.. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయిల ఆదాయం వచ్చే దేవాలయాలు 24 ఉన్నాయి. వీటిల్లో దాదాపు అన్ని ఆలయాల్లో లడ్డూ ప్రసాదం.. నెయ్యి కొనుగోలు అంశంపై ప్రైవేటుకు పెద్ద పీట వేస్తూ.. వారి నుంచే నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు.
తిరుమల లడ్డూ ఎపిసోడ్ నేపథ్యంలో తెలంగాణ ఆలయాల్లో నెయ్యి కొనుగోలుపై అనుసరిస్తున్న విధానాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాల్ని గుర్తించింది. కమీషన్ల కక్కుర్తితో ప్రైవేటు సంస్థల నుంచి నెయ్యిని కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్న వైనాన్ని గుర్తించింది. అంతేకాదు.. గతంలో విజయ డెయిరీ వద్ద నెయ్యిని కొనుగోలు చేస్తున్న ముంబయి సంస్థలు ప్రస్తుతం కొనుగోలు చేయటం లేదు.
ఈ కారణంగా విజయ డెయిరీ వద్ద 50 టన్నులకు పైగా నెయ్యి నిలిచిపోయింది. ఈ నిల్వలు ఎక్కువ రోజులు ఉంటే నాణ్యత దెబ్బ తింటుందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దేవాలయాలు అన్నింటిలోనూ విజయ నెయ్యి కొనుగోలు చేయాలంటూ విజయ సంస్థ ఎండీ లేఖలు రాసినా ఎలాంటి స్పందనా రాలేదు. ఈ అంశంపై ప్రభుత్వం వరకు వెళ్లింది. దీంతో స్పందించిన ప్రభుత్వం నెయ్యి కొనుగోలు విజయ డెయిరీ ద్వారానే జరగాలని ఆదేశాలుజారీ చేసింది. ఒకవేళ ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో విజయ నెయ్యిని కొనుగోలు చేసేందుకు తెలంగాణలోని ఐదు దేవాలయాలు ముందుకు వచ్చాయి. ఆ 5 దేవాలయాలు.. వారు ఆర్డర్ చేసిన నెయ్యి ఎంతన్నది చూస్తే..
1. వేములవాడ దేవస్థానం 10వేల కేజీలు
2. బాసర 1500 కేజీలు
3. వరంగల్ భద్రకాళి 1050 కేజీలు
4. ధర్మపురి ఆలయం 980 కేజీలు
5. మంచిర్యాల వేంకటేశ్వర 105 కేజీలు
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ రీతిలో అయితే నిర్ణయాన్ని తీసుకున్నదో.. అదే తరహాలో ఏపీలోని కూటమి సర్కారు సైతం అలాంటి నిర్ణయాన్ని తీసుకుంటే వివాదాలకు అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ.. ఏపీలోని ప్రభుత్వ రంగ డెయిరీలు ఉత్పత్తి చేసే నెయ్యి సరిపోదనుకుంటే.. ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగం సంస్థల డెయిరీలతో ఒప్పందం చేసుకోవటం మేలైన చర్యగా చెప్పొచ్చు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.