35.. 50.. 60.. తెలంగాణలో రేవంత్ సర్కారుకు ఎన్ని మార్కులు?
అందుకనే సంవత్సరం పాలనతోనే రేవంత్ రెడ్డి సర్కారుపై పూర్తి స్థాయి అభిప్రాయానికి రాలేమనేది విమర్శకుల అభిప్రాయం.
By: Tupaki Desk | 5 Dec 2024 12:09 PM GMTమరొక్క రోజులో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా పదేళ్ల పాటు అధికారం అందుకోలేకపోయిన హస్తం పార్టీ.. ఈ ఏడాదిలో ఏం చేసింది? అనేది చర్చకు వస్తోంది. వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా ఏడాది అంటే తక్కువ సమయమే. పైగా పదేళ్ల పాటు వేరొక పార్టీ అధికారంలో ఉన్నట్లయితే ఇది మరీ తక్కువ. అందుకనే సంవత్సరం పాలనతోనే రేవంత్ రెడ్డి సర్కారుపై పూర్తి స్థాయి అభిప్రాయానికి రాలేమనేది విమర్శకుల అభిప్రాయం.
ఎవరెవరు ఎన్ని మార్కులు వేశారంటే..?
తెలంగాణలో నిరుడు డిసెంబరు 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటును వివిధ ప్రజా సంఘాలు స్వాగతించాయి. కేసీఆర్ హయాంలో వారిపట్ల వ్యవహరించిన తీరే దీనికి కారణం. తెలంగాణ ఉద్యమంలో వీరంతా కీలక పాత్ర పోషించినవారే కావడం గమనార్హం. ఇప్పుడు అలాంటివారిలో రేవంత్ ప్రభుత్వానికి మార్కులు వేశారు కొందరు. వారిలో ప్రముఖ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
హరగోపాల్ సార్ 35 మాత్రమే..
హక్కుల నాయకుడిగా ప్రజా సంఘాల్లో మంచి పేరున్న వారు ప్రొఫెసర్ హరగోపాల్. కేసీఆర్ ఒక దశలో ఆయనను గౌరవించినా అధికారంలోకి వచ్చాక విస్మరించారు. దీంతో హరగోపాల్ ఆయనను వ్యతిరేకించారు. కాగా, హరగోపాల్ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారుకు పాస్ మార్కులు మాత్రమే ఇచ్చారు. అంటే.. ఒక మాజీ ప్రొఫెసర్ కావడంతో పేపర్ ను గట్టిగా దిద్ది రేవంత్ ప్రభుత్వాన్ని 35 మార్కులతో పాస్ చేయించారు.
కపిలవాయి 50
మాజీ ఎమ్మెల్సీగా, మంచి సబ్జెక్ట్ నాలెడ్జి ఉన్నవారిగా, ఒకప్పుడు ఢిల్లీలో కేసీఆర్ కు వ్యక్తిగత కార్యదర్శిగానూ పనిచేశారు కపిలవాయి దిలీప్ కుమార్. ఒకసారి ఎమ్మెల్సీ కూడా అయ్యారు. అలాంటి దిలీప్ కుమార్ కాలక్రమంలో కేసీఆర్ కు దూరమయ్యారు. ఆయన ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. దిలీప్ కుమార్.. తెలంగాణ ప్రభుత్వానికి 50 మార్కులు వేశారు.
కూనంనేని ఫస్ట్ క్లాస్
తెలంగాణలో రెండేళ్ల కిందట జరిగిన మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు పలికాయి వామపక్షాలు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తును ఆశించాయి. కేసీఆర్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో విసుగుచెందాయి. వీటిలో సీపీఐ తమకు ఒక్క సీటే దక్కినా చాలని భావించింది. పొత్తులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు పోటీ చేసి గెలిచారు. దీంతో ఒకవిధంగా ప్రభుత్వంలో పరోక్షంగా భాగమయ్యారు. కాగా, రేవంత్ ప్రభుత్వానికి కూనంనేని 60 మార్కులు వేశారు. అంటే ఫస్ట్ క్లాస్ ఇచ్చారు.
కొసమెరుపు: ఈ ముగ్గురు ఏదో ఒక దశలో కేసీఆర్ దగ్గర ఆదరణ పొంది ఆపై ఆయన చేతిలో అవమానపడినవారే కావడం గమనార్హం.