Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో తెలంగాణ సర్కారు నిర్మించు.. 'ఫైవ్ స్టార్ హోటల్'

కూతవేటు దూరంలో సైబర్ టవర్స్.. చుట్టూ సాఫ్ట్ వేర్ కంపెనీలు.. ఇలాంటి దగ్గర మామూలు హోటల్ ఉంటేనే మహా డిమాండ్ నెలకొంటుంది

By:  Tupaki Desk   |   13 Jan 2025 6:30 PM GMT
హైదరాబాద్ లో తెలంగాణ సర్కారు నిర్మించు.. ఫైవ్ స్టార్ హోటల్
X

కూతవేటు దూరంలో సైబర్ టవర్స్.. చుట్టూ సాఫ్ట్ వేర్ కంపెనీలు.. ఇలాంటి దగ్గర మామూలు హోటల్ ఉంటేనే మహా డిమాండ్ నెలకొంటుంది. అలాంటిది స్టార్ హోటల్ అంటే మామూలు మాటలా..? నిత్యం రద్దీగా ఉండడం ఖాయం.. అలాంటిచోట ప్రభుత్వమే హోటల్ నిర్మాణానికి రంగంలోకి దిగితే.. అది కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేపడితే..?

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తో పాటు నాలుగో నగరం (ఫోర్త్ సిటీ) అంటూ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణాన్ని తలకెత్తుకోనుంది. దేశంలోనే పెద్ద నగరాల్లో ఒకటిగా నిలిపేలా.. ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా..

పరిశ్రమలను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా ఏ-గ్రేడ్‌ వాణిజ్య కేంద్రం (ట్రేడ్‌ సెంటర్‌)తో కూడిన ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం చేపట్టనుంది.

కాగా, తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే టీ-వర్క్స్‌, టైమ్‌-స్క్వేర్‌ ను నిర్మాణం తలపెట్టిన సంగతి తెలిసిందే. వీటికి అనుసంధానంగా అధునాతన వసతులతో, అత్యంత విశాల హోటల్‌, అందులోనే వాణిజ్య కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇది కార్యాలయాల అవసరాలు తీర్చడానికి పనికొస్తుందిది.

హైటెక్‌ సిటీకి దగ్గర్లో రాయదుర్గం ఐకియా షోరూం పక్కన తెలంగాణ ప్రభుత్వం ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనుంది. కాగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం లో హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీ సర్వే నంబర్‌ 83/1లో మూడు ఎకరాలలో హోటల్ నిర్మాణం చేపట్టనుంది.

15 అంతస్తులు.. 8.86 లక్షల అడుగుల విస్తీర్ణంలో నిర్మాణానికి రూ.582 కోట్లను ఖర్చు చేయనుంది. కాగా, ప్రపంచ టాప్ 10 హోటళ్లలో ఒకటిగా దీనిని అత్యంత విలాసంగా నిర్మించాలని నిర్ణయించింది. సరిగ్గా 36 నెలల్లో హోటల్‌, వాణిజ్య కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుని బిడ్డర్లను ఆహ్వానించింది.

గ్లోబల్‌ సదస్సులకు వేదికగా..

వరల్డ్‌ మెట్రోపాలిటన్‌ కాంగ్రెస్‌, బయో ఏసియా సమ్మిట్‌, గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌, ఇండియా జాయ్‌ గ్లోబల్‌ యూత్‌ ఫెస్టివల్‌, వరల్డ్‌ జియో స్పేసియల్‌ ఇన్ఫర్మేషన్‌ కాంగ్రెస్‌ వంటి అంతర్జాతీయు సదస్సులతో హైదరాబాద్‌ నగరం ప్రయాణ, పర్యాటక, వ్యాపారానికి గమ్యస్థానంగా మారింది. ఏటా కనీసం 30కి పైగా గ్లోబల్‌ సదస్సులకు హైదరాబాద్‌ వేదికగా ఉంటోంది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(హెచ్‌ఐసీసీ) అనేక పెద్ద పెద్ద సదస్సులకు ఆతిథ్యం ఇచ్చింది. ఏడాదికి సగటున వివిధ ప్రాంతాల నుంచి సుమారు 4 లక్షల మంది ప్రతినిధులు వస్తున్నట్టు వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగంలో హైదరాబాద్‌ 159వ స్థానంలో ఉంది. ఇక దేశంలోని ఉత్తమ నగరాల్లో ఢిల్లీ తరువాత హైదరాబాద్‌ 2వ స్థానంలో ఉంది. వీటన్నింటి నేపథ్యంలోనే వివిధ దేశాల నుంచి వచ్చేవారికి ప్రపంచంలోనే ఒక మంచి అనుభూతిని కలిగించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ లగ్జరీ హోటల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కాగా ఈ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌, వాణిజ్య కేంద్రాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిర్మించతలపెట్టిన టైమ్‌స్క్వేర్‌, టీ-వర్స్క్‌ భవనాలకు అండర్‌గ్రౌండ్‌, అండర్‌పా్‌సలతో అనుసంధానించనుంది.

హైదరాబాద్ లో ప్రస్తుతం 5-స్టార్‌ డీలక్స్‌ స్థాయిలో 6 హోటళ్లు, వీటిలో 1,647 గదులున్నాయి. 5-స్టార్‌ హోటల్స్‌ 8 ఉండగా 1,412 గదులు, 4-స్టార్‌ హోటళ్లు 4 ఉండగా 547 గదులు, 3-స్టార్‌ హోటళ్లు 5 ఉండగా.. వీటిలో 321 గదులు ఉన్నాయి.