రేవంత్ రెడ్డికి రెఫరెండమేనా? పట్టభద్రుల ఎన్నికతో కాంగ్రెస్ భవితవ్యం తేలిపోనుందా?
అదే సమయంలో ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత.. స్థానిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నిక సెమీ ఫైనల్స్ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 26 Feb 2025 2:03 PM GMTతెలంగాణలో ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్ర నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెఫరెండంగా భావిస్తున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయనుండటంతో ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తేలిపోతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 33 జిల్లాల్లో దాదాపు సగం అంటే 15 జిల్లాల ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఇలా ఎటుచూసినా దాదాపు సగం రాష్ట్రంలో ఎన్నిక సందడి కనిపిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత.. స్థానిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నిక సెమీ ఫైనల్స్ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలోని పట్టభద్ర నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణ గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నా లోపాయికారీగా బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్నిక జరుగుతున్న నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్ఎస్, బీఎస్పీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ రేసులో లేనందున ఆ పార్టీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన ప్రతపక్షం పోటీలో లేకపోయినా కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికలను తేలిగ్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఎన్నడూ లేనట్లు పట్టభద్ర ఎమ్మల్సీ ఎన్నికకు ముఖ్యమంత్రి స్థాయి నేత ప్రచారం చేయడం ఆ పార్టీ ఈ ఎన్నికను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో తెలియజేస్తోందని అంటున్నారు. ఇక ఏడుగురు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలకు ఎన్నిక బాధ్యతలను అప్పగించారు. ఇక ఎన్నిక జరుగుతున్న నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి 19 మంది, బీఆర్ఎస్ పార్టీకి 16, బీజేపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు ఆరు పార్లమెంటు నియోజకవర్గాల్లో మూడు చోట్ల కాంగ్రెస్, మూడు చోట్ల బీఆర్ఎస్ గెలిచాయి. దీంతో రెండు పార్టీల బలాబలాలుపై క్లారిటీ ఉండటం లేదు.
ఇక అధికారంలోకి వచ్చిన అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేశారని నిరుద్యోగులు తమవైపు ఉన్నారని నమ్మకం పెట్టుకుంటోంది. మరోవైపు కుల గణన నిర్వహించి బీసీలకు ప్రాధాన్యమిస్తామని ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ కు సానుకూలమంటున్నారు. అయితే బీసీలకు ప్రాధాన్యమిస్తామన్న ఆ పార్టీ ఓసీ నేతను రంగంలోకి దింపడంతో విమర్శలు ఎదుర్కొంటోందని అంటున్నారు. అయితే ప్రతిపక్షం కూడా అదే సామాజికవర్గం నేతను బరిలోకి దింపడంతో బీఎస్పీ అభ్యర్థి సాధించే ఓట్లు కీలకమని చెబుతున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి రెండు ప్రధాన పార్టీలకు చమటలు పట్టిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు తమకు రాజకీయంగా ప్రత్యర్థులు కావడం, ఆ పార్టీలు గెలిస్తే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండటంతో గులాబీ నేతలు, కార్యకర్తలు బీఎస్పీ అభ్యర్థికి దన్నుగా నిలవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇక బీఎస్పీ అభ్యర్థి బీసీ కావడం కూడా ఆయనకు కలిసివస్తుందంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ టెన్షన్ కనిపిస్తోందని అంటున్నారు. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా భావించి యావత్తు పార్టీ రంగంలోకి దిగడం వల్ల ఆ పార్టీ ఈ ఎన్నికను రిఫరెండంగా భావించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు.
మరోవైపు బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ఖాతా తెరవాలని కుతూహులం ప్రదర్శిస్తోంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, సీనియర్ నేత ఈటల స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. పార్టీ ఇన్చార్జి సునీల్ బన్సల్ పర్యవేక్షణలో బీజేపీ మూకుమ్ముడిగా పనిచేస్తోంది. మరోవైపు ఆ పార్టీ సక్సెస్ ఫుల్ ఫార్ములా పేజీ పాఠక్ లను రంగంలోకి దింపింది. ప్రతి 20 మంది ఓటర్లకు ఓ ఇన్ చార్జిని నియమించి ఓటర్లను కలుస్తుండటంతో క్షేత్రస్థాయిలో పట్టుబిగిస్తోంది. ఈ పరిణామాలు అధికార పార్టీకి సవాల్ విసురుతున్నట్లే చెబుతున్నారు. ఏదిఏమైనా ఈ ఎన్నికలో గెలిచిన పార్టీకి వచ్చే స్థానిక ఎన్నికల్లో మంచి అవకాశాలు ఉంటాయంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇది అగ్ని పరీక్షగా చెబుతున్నారు.