3 పార్టీల పోటాపోటీ.. 40 మంది ఎమ్మెల్యేలు.. తెలంగాణలో మరో ఎన్నిక..
కారణం.. గత ఏడాది అధికారం చేతులు మారడం. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సిటింగ్ స్థానం కావడం.
By: Tupaki Desk | 26 Sep 2024 1:30 AM GMTగత ఏడాది నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు.. ఆపై మే నెలలో లోక్ సభ ఎన్నికలు.. ఓ ఎమ్మెల్సీ, అసెంబ్లీ ఉప ఎన్నికలు.. ఇలా దాదాపు సుదీర్ఘ సమయం ఎన్నికల కోలాహలం నెలకొంది తెలంగాణ. ఇంకా స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, వీటి మధ్యనే మరో ఎన్నిక కూడా వస్తోంది. అక్కడ పోటీ తీవ్రంగా ఉంది. కారణం.. గత ఏడాది అధికారం చేతులు మారడం. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సిటింగ్ స్థానం కావడం.
మూడు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకం
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడూ గట్టిగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నిక ఆసక్తి రేపుతోంది. కానీ, ఇదేమీ లోక్ సభ, శాసన సభ ఎన్నిక కాదు.. చట్టసభ అయిన శాసన మండలి స్థానం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. దీని టికెట్ కోసం పార్టీల్లోనే నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇదంతా కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ గురించి. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 40 అసెంబ్లీ సీట్లున్నాయి. కరీంనగర్ ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ సిటింగ్ స్థానం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదని భావిస్తోంది. ఇక బీఆర్ఎస్ కు ఉత్తర తెలంగాణ ఆయువుపట్టు. అలాంటిచోట ఎమ్మెల్సీ కూడా ఓడితే పెద్ద దెబ్బనే. గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై పట్టభద్రుల్లో వ్యతిరేకత ఉందని ప్రచారం చేయొచ్చు. మరోవైపు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహించేది కరీంనగర్ నుంచే. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లలో ఆ పార్టీ ఎంపీలే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై యువతలో మంచి అభిప్రాయం ఉందని చాటేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవడం చాలా కీలకం.
ఇప్పటికే కాక..
నాలుగు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు. కానీ, ఇప్పటినుంచే ప్రచారం మొదలైంది. తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలంటూ గ్రాడ్యుయేట్లను కోరుతున్నారు వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్టీ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతకాలం పార్టీలను అంటీముట్టనట్లుగా ఉన్న నాయకులు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీలతో సంబంధం లేనివారూ రంగంలోకి దిగనుండడంతో ఎమ్మెల్సీ ఎన్నిక పార్టీలు-సామాన్యులు అన్నట్లుగా మారింది.
కాంగ్రెస్‌లో పెరిగిన పోటీ
ఇది కాంగ్రెస్ సీటు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలుచుకున్న సీటును అధికారంలోకి వచ్చాక చేజార్చుకుంటే రాజకీయంగా పెద్ద దెబ్బ అవుతుంది. ఇక తమ కంచుకోటలో తిరిగి సత్తా చాటాలని బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఓసారి స్వామిగౌడ్ గెలవగా, 2019 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి విజయం సాధించారు. జీవన్ రెడ్డితో పాటు ఇప్పుడు వెలిచాల రాజేందర్ రావు, మేనేని రోహితరావు, ప్రణవ్ బాబు, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నరేందర్ రెడ్డి సొంతంగా అయినా పోటీకి సిద్ధంగా ఉన్నారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడికి కాంగ్రెస్ టికెట్ నిరాకరిస్తుందా? మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఆయనను ఎంపీగానూ పోటీకి నిలిపింది. జీవన్ రెడ్డి పోటీ చేస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరమే. బీఆర్ఎస్ నుంచి యాదగిరి శేఖర్ రావు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూడా పోటీలో ఉన్నారు.
4 ఎంపీలు.. ఒక ఎమ్మెల్సీ..
నాలుగు ఉమ్మడి జిల్లా కేంద్రాల ఎంపీలూ బీజేపీ వారే. అందుకని ఆ పార్టీ నుంచి పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. పొలసాని సుగుణాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాణి రుద్రమ, జగిత్యాల జిల్లా నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ బి.ఎన్ రావు కూడా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల కాక పెరిగేనాటికి పరిస్థితులు ఇంకా మారవచ్చు. ఒక పార్టీ నుంచి టికెట్ రానివారు రెబల్ గా బరిలోకి దిగొచ్చు? చివరకు ఏం జరుగుతుందో చూడాలి.