తెలంగాణలో 'కుమ్మక్కు' పాలిటిక్స్
అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సవాల్ గా తీసుకున్న బీజేపీ నేతలు వెంటనే స్పందించారు.
By: Tupaki Desk | 25 Feb 2025 7:30 PM GMTతెలంగాణలో కుమ్మక్కు పాలిటిక్స్ నడుస్తున్నాయా? రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు ఒకరితో ఒకరు కుమ్మక్కు అయ్యారంటూ ఆరోపణలు చేసుకోవడం ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయంటూ బీజేపీ, కాదు బీఆర్ఎస్ తోనే కమలం పెద్దలు కుమ్మక్కు అయ్యారంటూ హస్తం నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య అవగాహన ఉందని ప్రచారం చేసిన కాంగ్రెస్.. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సందర్భంగా అవే ఆరోపణలు చేయడం విశేషం. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సవాల్ గా తీసుకున్న బీజేపీ నేతలు వెంటనే స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అవగాహన రాజకీయాలు నడుస్తున్నాయంటూ దుమ్మెత్తిపోశారు.
తెలంగాణ రాజకీయాల్లో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక అగ్గి రాజేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీలో లేకపోయినా.. అధికార పార్టీ కాంగ్రెస్, మరో ప్రతిపక్షం బీజేపీ రంగంలో దిగడంతో ఎన్నికల పోరు సెగ పుట్టిస్తోంది. సాధారణ ఎన్నికలకు మించిన స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేయడం ఈ ఎన్నికల్లో హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగ ప్రవేశం చేసి గ్రాడ్యుయేట్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం గమనార్హం. మరోవైపు బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం చేస్తుండటంతో ఎన్నిక ఇరు పార్టీలకు సవాల్ గా మారిందంటున్నారు.
ఓటర్లను ఆకర్షించేందుకు ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఉరుము ఉరిమి మంగళంపై పడినట్లు రెండు పక్షాలు మాటల యుద్ధం చేస్తూ పోటీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని మధ్యలోకి లాగుతుండటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయంటూ బీజేపీ.. గులాబీ-కమలం చేతులు కలిపాయని కాంగ్రెస్ ఆరోపణలు చేసుకుంటుండటం ఇంట్రస్టింగుగా మారింది.
ఫోన్ ట్యాపింగు కేసులో బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు అరెస్టు కాకుండా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ఇద్దరిని బీజేపీ తీసుకువస్తే, తాము 48 గంటల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తామని చాలెంజ్ చేశారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడంతోనే వదిలేశారని సీఎం రేవంత్ ఆరోపించారు.
అయితే సీఎం వ్యాఖ్యలను బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అవడం వల్లే ఫోన్ ట్యాపింగ్ కేసు నిర్వీర్యం అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. ఫోన్ ట్యాపింగు కేసును సీఎం రేవంత్ రెడ్డి వదిలేసినా, తాము విడిచిపెట్టమని కిషన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పారిపోతే ఇక్కడున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును అరెస్టు చేయొచ్చు కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ తో చిక్కటి ఒప్పందాలు చేసుకుని బురద మాపై పూస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటరిచ్చారు.
ఇలా తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై కుమ్మక్కు రాజకీయం రసకందాయంగా మారుతోంది. ఎవరి ఎవరితో చేతులు కలిపారో గానీ, పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ ను మధ్యలోకి లాగడమే ఆసక్తికరం అంటున్నారు.