Begin typing your search above and press return to search.

ఏపీలో కేస్ట్ సర్టిఫికెట్ తెలంగాణలో చెల్లుబాటు అవుతుందా?.. ఇదిగో క్లారిటీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.. తెలంగాణ రాష్ట్రంలోని పీజీ మెడికల్ ప్రవేశాలకు చెల్లుబాటు అవుతుందా అనే అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

By:  Tupaki Desk   |   11 Feb 2025 2:30 PM GMT
ఏపీలో కేస్ట్ సర్టిఫికెట్ తెలంగాణలో చెల్లుబాటు అవుతుందా?.. ఇదిగో క్లారిటీ!
X

రిజర్వేషన్స్ కోసం సమర్పించే కుల ధృవీకరణ పత్రాల చెల్లుబాటు విషయంలో తాజాగా తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఇటీవల పీజీ మెడికల్ అడ్మిషన్స్ విషయంలో ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ మేరకు జరిగిన విచారణ సందర్భంగా... ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

అవును... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.. తెలంగాణ రాష్ట్రంలోని పీజీ మెడికల్ ప్రవేశాలకు చెల్లుబాటు అవుతుందా అనే అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా పిటిషనర్ల తరుపున సీనియర్ న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని రిజర్వేషన్ల కేటాయింపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించకపోవడ్దం వల్ల ఎస్సీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అన్నారు.

వాస్తవానికి ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వ్యుల ద్వారా పిటిషనర్ లను స్థానికులుగా పరిగణిస్తున్నప్పటికీ.. కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్శిటీ మాత్రం ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీ కింది ఆమోదించడం లేదని అన్నారు. తేజ్ ప్రకాశ్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం నిబంధనలు మధ్యలో మార్చకూడదని అన్నారు.

మరోపక్క ప్రభుత్వం, కాళోజీ యూనివర్శిటీ తరుపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. విభజన రాష్ట్రంలో ఉన్నందున ఏపీకి చెందిన ఎస్సీ సామాజికవర్గాలు ఇక్కడ రిజర్వేషన్లు కోరడం సరికాదని అన్నారు. ఏపీలో ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం ద్వారా తెలంగాణలో రిజర్వేషన్స్ ఇస్తే.. రాష్ట్ర విభజన లక్ష్యాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా.. ఇరు పక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఏపీలో పొందిన సర్టిఫికెట్ ద్వారా ఇక్కడ రిజర్వేషన్లు కల్పించాలని అనుమతి మంజూరు చేయలేమని స్పష్టం చేసింది.