యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూసే ప్రోగ్రాం షెడ్యూల్!
యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చేసే ఒక ఆసక్తికర పోటీలకు వేదికగా మారనుంది. ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ను ఎంపిక చేశారు.
By: Tupaki Desk | 20 Feb 2025 4:55 AM GMTయావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చేసే ఒక ఆసక్తికర పోటీలకు వేదికగా మారనుంది. ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ను ఎంపిక చేశారు. ఈ ఏడాది మే 4 నుంచి 31 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ.. ముగింపు వేడుకలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ మేరకు నిర్వాహకులు పోటీల వివరాల్ని బుధవారం ప్రకటించారు. ప్రపంచానికి చెందిన 140 దేశాలకు చెందిన ‘మిస్’ లు ఈ పోటీల్లో పొల్గొంటున్నారు. ఇప్పటివరకు ఈ పోటీలు మన దేశంలో రెండు సార్లు మాత్రమే జరిగాయి.
గతంలో 1996లో మొదటిసారి జరగ్గా.. రెండోసారి గత ఏడాది జరిగాయి. మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగే అవకాశాన్ని సొంతం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ముంబయి వేదికగా ఈ పోటీలు జరిగాయి.నిజానికి ఈసారి పోటీలకు దుబాయ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది.అయితే.. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపుతో పాటు చారిత్రక.. గ్రామీణ ప్రాంతాల ప్రత్యేకతల కారణంగా హైదరాబాద్ మహానగారానికి ఈ పోటీల్ని నిర్వహించే అవకాశం లభించిందని చెప్పాలి.
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీల్ని నిర్వహించనున్నట్లుగా మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్ పర్సన్.. సీఈవో జూలియా మోర్లీ.. రాష్ట్ర పర్యాటక.. సాంస్క్రతిక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ తో కలిసి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంతో శ్రమించి ఈ పోటీల్ని తెలంగాణకు తీసుకొస్తున్నట్లుగా స్మితా సభర్వాల్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేకల్ని వివరించామని.. దీని కోసం దాదాపు నెల రోజులుగా చర్చలు జరిపినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ సంప్రదాయాలు.. కళలు వివిధ థీమ్ లు రూపొందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏమైనా.. ఈ పోటీలు ప్రపంచ దేశాల ద్రష్టిలో హైదరాబాద్ మహానగరం పడేలా చేస్తాయని చెప్పక తప్పదు.