హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. కారణాలివే..?
హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా.. రెండు నెలలుగా దూకుడుగా ముందుకు సాగుతోంది.
By: Tupaki Desk | 30 Sep 2024 7:42 AM GMTహైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా.. రెండు నెలలుగా దూకుడుగా ముందుకు సాగుతోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఏ నిర్మాణాలు ఉన్నా వాటిని కూల్చివేస్తోంది. అలా ఇప్పటివరకు వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఏ లక్ష్యంతో అయితే హైడ్రా ఏర్పాటైందో.. ఆ లక్ష్యంతో దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన డైరెక్షన్‌లో ముందుకు సాగుతోంది.
అయితే.. హైడ్రా ఏర్పాటు నుంచి రెండు నెలల కాలంలో ఏనాడూ కూల్చివేతలకు బ్రేక్ ఇవ్వలేదు. కానీ.. ఇప్పుడు ఒక్కసారిగా హైడ్రా వెనక్కి తగ్గింది. గత రెండు రోజులుగా కూల్చివేతలకు బ్రేక్ వేసింది. దీనికి పలు కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
హైడ్రా కూల్చివేతలతో చాలా మంది ప్రజలు రోదించడం చూశాం. ఇటీవల ఆ వీడియోలు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయ్యాయి. అటు ప్రతిపక్షాలు సైతం హైడ్రా కూల్చివేతలపై గగ్గోలు పెడుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం చూస్తున్నాం. దాంతో వారి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో హైడ్రాపై చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలోనూ చాలా వరకు నెగెటివ్ కామెంట్స్ వచ్చి పడ్డాయి.
మరోవైపు.. మూసీ ప్రక్షాళన పేరిట అక్కడి వారిని ఖాళీ చేయాలనే ప్రయత్నం నడుస్తోంది. దాంతో అక్కడి వారు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే పలువిధాలా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల బీఆర్ఎస్ ఆఫీసుకు కూడా చేరుకున్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ మద్దతు కోరారు. ఇక ఇప్పుడు ఆ బాధితులకు ప్రతిపక్షాలు కూడా తోడయ్యాయి. ఈ క్రమంలో వారిని టచ్ చేస్తే వారి నుంచి మరిన్ని నిరసనలు ఎదుర్కోక తప్పదు.
ఈ పరిణామాల మధ్య కూల్చివేతలకు కాస్త విరామం ఇవ్వాలని హైడ్రా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తున్నది. అటు హైకోర్టు నుంచి కూడా బాధితులకు అనుకూలంగా పలు తీర్పులు వచ్చాయి. బాధితుల ఆక్రందనలు, నిరసనల నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు సైతం పునరాలోచనలో పడ్డాయి. మూసీ పరిధిలో ఇప్పటికే చాలా వరకు ఇళ్లకు మార్కింగ్ చేశారు. మరికొన్నింటికి చేయాల్సి ఉంది. కానీ.. ఇప్పుడు అధికారులు వాటి జోలికి పోవడం లేదు. కాస్త విరామం తీసుకొని ప్రజా ఫిర్యాదులపై సమగ్ర పరిశీలన చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ప్రత్యేకించి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అనుమతులు ఉన్న వాటిపై స్టడీ చేసి చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.