Begin typing your search above and press return to search.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు బ్రేకులేనా?

అయితే ఈ పథకంలో పూర్తిగా గ్రామీణ కూలీలకే లబ్ది చేస్తున్నారని, పట్టణాల్లో నివసించే రైతు కూలీలను విస్మరిస్తున్నారని సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

By:  Tupaki Desk   |   27 Jan 2025 11:30 PM GMT
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు బ్రేకులేనా?
X

రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ ఎన్నికల హామీ అయిన రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా కాంగ్రెస్ సర్కార్ నామకరణం చేసింది. అయితే తొలి విడత నగదు పంపిణీ ప్రారంభించిన సమయంలోనే ప్రభుత్వం దూకుడుకు కళ్లెం వేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఆర్థికం సాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన 13 నెలల తర్వాత దీనిపై విధి విధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు ఈ పథకాన్ని ప్రారంభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా నాలుగు పథకాలను ప్రారంభిస్తే, అందులో రైతు కూలీలకు సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఒకటి. అయితే ఈ పథకంలో పూర్తిగా గ్రామీణ కూలీలకే లబ్ది చేస్తున్నారని, పట్టణాల్లో నివసించే రైతు కూలీలను విస్మరిస్తున్నారని సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

కేవ‌లం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీల‌కు మాత్ర‌మే ప‌థ‌కాన్ని పరిమితం చేస్తూ సర్కారు ఉత్త‌ర్వులు జారీ చేయడాన్నిసవాల్ చేస్తూ నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీల్లోని 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు నష్టపోతున్నారని పిటిషనర్ తెలిపారు. గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకు సాయం చేసి పట్టణాల్లో నివసిస్తున్న కూలీలకు సాయం చేయకపోవడం స‌రైంది కాదని పిటిష‌నర్ కోర్టుకు నివేదించారు. ఎక్క‌డ ఉన్నా రైతు కూలీలు అంతా స‌మాన‌మేన‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. కేవ‌లం గ్రామాల్లోని వారికే వ‌ర్తింప‌జేయ‌డం సుప్రీంకోర్టు తీర్పుల‌కు విరుద్ధమని చెప్పారు. ఈ పిటిష‌నను విచారించిన చీఫ్ జ‌స్టిస్ ధ‌ర్మాస‌నం పట్టణాలు, నగరాల్లో రైతు కూలీల‌కు ఇందిరమ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కం వ‌ర్తించ‌డంపై నాలుగు వారాల్లో నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప్రభుత్వానికి సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది.