Begin typing your search above and press return to search.

ఏడాదిలో నాలుగోసారి చట్ట సభకు ఓటేస్తున్న తెలంగాణ ప్రజలు

దీంతో తెలంగాణ ప్రజల వేలిపై రెండోసారి సిరా చుక్క పడింది. కాగా, తెలంగాణలో ఆ జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం నాలుగోసారి ఎన్నికల్లో పాల్గొంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Nov 2024 1:30 PM GMT
ఏడాదిలో నాలుగోసారి చట్ట సభకు ఓటేస్తున్న తెలంగాణ ప్రజలు
X

ఉమ్మడి ఏపీ 2014 జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోయింది. దీనికిముందే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఎన్నికలు జరిగాయి. అయితే.. అప్పటికే రాష్ట్ర విభజన ఖరారైన నేపథ్యంలో జూన్ 2న తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అదే ఏడాది జూన్ 9న నవ్యాంధ్రప్రదేశ్ లోనూ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ లెక్కన రెండు అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు జరగాలి. కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. దీంతో 2023లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక తెలంగాణ ప్రజలు 2019, 2024లో లోక్ సభ ఎన్నికలకు ఓటేశారు.

వరుస ఎన్నికలు..

తెలంగాణలో నిరుడు నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే, ఈ ఏడాది మే నెలలో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. దీంతో తెలంగాణ ప్రజల వేలిపై రెండోసారి సిరా చుక్క పడింది. కాగా, తెలంగాణలో ఆ జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం నాలుగోసారి ఎన్నికల్లో పాల్గొంటున్నారు.

‘మహా’నుబంధం

తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలతో ఎక్కువ శాతం సరిహద్దులున్నాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మహారాష్ట్రకు బాగా దగ్గర. వీటిలో కల్చర్ కూడా తెలుగు, మరాఠా కలిసి ఉంటుంది. ఇక కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాల వారికి తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ ఓటుంది. దీంతో వీరికి రెండు అసెంబ్లీ ఎన్నికలకు ఓటు వేసే అరుదైన అవకాశం దక్కింది. ఈ గ్రామాలు.. పరందోలి, ముకదమ్‌ గూడ, అంతాపూర్, బోలాపటార్, కోట, పద్మావతి, మహరాజ్‌గూడ, శంకర్‌లొద్ది, ఇంద్రానగర్, ఎస్సాపూర్, గౌరి, లెండిగూడ. వీటిలో తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల పాలన సాగుతుండడం విశేషం.

అన్నీ ఇద్దరేసి..

ఈ 12 గ్రామాల్లో వార్డు సభ్యుల నుంచి సీఎం వరకు ఇద్దరేసి ప్రజాప్రతినిధులు ఉండడం మరో విశేషం. నిరుడు నవంబరు 30న తెలంగాణ ఎన్నికల్లో ఆసిఫాబాద్‌ నియోజకవర్గ అభ్యర్థికి, ఈ ఏడాది లోక్‌ సభ ఎన్నికల్లో ఏప్రిల్‌ 19న మహారాష్ట్రలోని చంద్రపూర్‌ ఎంపీ స్థానానికి, మే 13న తెలంగాణలోని ఆదిలాబాద్‌ ఎంపీ స్థానానికి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మళ్లీ ఈ నెల 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజూరా నియోజకవర్గ అభ్యర్థికి ఓటు వేయనున్నారు.

ఎందుకింత వైరుధ్యం?

ఈ 12 గ్రామాలు 1956లో రాష్ట్రాల పునర్విభజనలో ఉమ్మడి ఏపీ పరిధిలోకి వచ్చాయి. కానీ, భౌగోళికంగా, సాంస్కృతికంగా తమతో దగ్గరగా ఉన్నాయంటూ మహారాష్ట్ర ప్రభుత్వం 1987లో చంద్రాపూర్‌ జిల్లా జివితి తాలూకాలో చేర్చింది. అప్పట్లో వివాదం పరిష్కారానికి రెండు రాష్ట్రాలు కేకే నాయుడు కమిషన్‌ వేశాయి. దీంతోపాటు ఏపీ ఉమ్మడి హైకోర్టు సైతం ఈ గ్రామాలన్నీ ఉమ్మడి ఏపీవేనని తేల్చిచెప్పాయి. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కేసు అక్కడ పెండింగ్ లో ఉంది.