Begin typing your search above and press return to search.

మిషన్ భగీరథలో రూ.20వేల కోట్ల స్కామ్.. బాంబ్ పేల్చిన తెలంగాణ మంత్రి

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలు పథకాలు అమలయ్యాయి. రైతుబంధు, దళితబంధు, రైతుభరోసా తదితర పథకాలను ఆ పదేళ్ల కాలంలో అమలు చేసింది.

By:  Tupaki Desk   |   20 Sep 2024 5:07 AM GMT
మిషన్ భగీరథలో రూ.20వేల కోట్ల స్కామ్.. బాంబ్ పేల్చిన తెలంగాణ మంత్రి
X

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలు పథకాలు అమలయ్యాయి. రైతుబంధు, దళితబంధు, రైతుభరోసా తదితర పథకాలను ఆ పదేళ్ల కాలంలో అమలు చేసింది. వీటితోపాటే చెరువులను బాగు చేసేందుకు మిషన్ కాకతీయ సైతం నిర్వహించింది. అలాగే... ఇంటింటికీ సురక్షిత నీరు అందించేందుకు మిషన్ భగీరథను ప్రవేశపెట్టింది.

ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నల్లాలు పెట్టి.. 24 గంటలు సురక్షిత తాగునీరు సరఫరా చేయడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం గురించి గత ప్రభుత్వం సైతం చాలా వరకు గొప్పలు చెప్పుకుంది. అటు ఎన్నికల ప్రచారంలోనూ తాము ఇంటింటికీ 24 గంటలు నీటిని అందించామని కేసీఆర్ కూడా చాలాసార్లు ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే.. పథకం లక్ష్యం మంచిదే అయినప్పటికీ దానిని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారనే విమర్శలు సైతం ఉన్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో ఇప్పుడు గత ప్రభుత్వంలో అమలైన పథకాలు, వాటిల్లో చోటుచేసుకున్న అక్రమాలపై ఆరా తీస్తోంది. ఒక్కొక్క అవినీతిని బయటపెడుతోంది. అయితే.. నిన్న వరంగల్ జిల్లా నర్సంపేటలో మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మిషన్ భగీరథపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథ స్కీమ్‌లో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. రూ.46వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో రూ.20వేల కోట్ల వరకు అవినీతి జరిగిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి మిషన్ భగీరథపై సర్వే నిర్వహించిందని, రాష్ట్రవ్యాప్తంగా 53 శాతం ఇళ్లకు మంచినీరు అందడం లేదనే భయంకరమైన నిజం వెలుగుచూసిందన్నారు.

ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, గొర్రెల స్కీమ్, జీఎస్టీ స్కామ్‌లంటూ పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్.. తాజాగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపణలతో పుండు మీద కారం చల్లినట్లుగా అయింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వయిరీ కమిషన్ వేసి విచారణ చేపట్టింది. అటు.. జీఎస్టీ స్కామ్ మీద కూడా సీఐడీ విచారణ నడుస్తోంది. తాజాగా.. మంత్రి ఆరోపణలు నేపథ్యంలో మిషన్ భగీరథపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు...? అనేది చర్చకు దారితీసింది.