Begin typing your search above and press return to search.

తెలంగాణ రేసులో ఆరో అభ్యర్థి.. కాంగ్రెస్ ను టెన్షన్ పెడుతున్న బీఆర్ఎస్

తెలంగాణ పాలిటిక్స్ లో ట్రైయాంగిల్ ఫైట్ ఆసక్తికరంగా మారుతోంది. అధికార కాంగ్రెస్ ను ఢీకొట్టే విషయంలో ప్రతపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   26 Feb 2025 1:18 PM GMT
తెలంగాణ రేసులో ఆరో అభ్యర్థి.. కాంగ్రెస్ ను టెన్షన్ పెడుతున్న బీఆర్ఎస్
X

తెలంగాణ పాలిటిక్స్ లో ట్రైయాంగిల్ ఫైట్ ఆసక్తికరంగా మారుతోంది. అధికార కాంగ్రెస్ ను ఢీకొట్టే విషయంలో ప్రతపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో రాజకీయం సస్పెన్స్ సినిమా క్లైమాక్స్ లా ఉత్కంఠ రేపుతోంది. త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి.

తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 20న జరగనున్నాయి. ప్రస్తుతం సభలో బలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ నాలుగు, బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఆరో అభ్యర్థిని రంగంలోకి దింపి రెండు స్థానాలు గెలుచుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార కాంగ్రెస్ హైఅలర్ట్ అయిందంటున్నారు. గతంలో ఏపీలో ఈ తరహా రాజకీయం నడిచింది. 2023 మార్చి 23న జరిగిన ఎన్నికల్లో బలం లేకపోయినా అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ తన అభ్యర్థిని పోటీలో పెట్టి చాకచక్యంగా ఓ స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పుడు తెలంగాణలో అదే రాజకీయాన్ని పునరావృతం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు తావిస్తోంది.

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 69 స్థానాల్లోను సీపీఐ ఓ స్థానంలోను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 35, బీజేపీకి 8, ఎంఐఎం పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యే ఉన్నారు. ఇక మొత్తం ఎమ్మెల్యేలు తమ తరఫున ఐదుగురు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సివుండగా, ఒక్కో సభ్యుడిని ఎన్నుకోడానికి 24 మంది సభ్యుల బలం అవసరం. అయితే బీజేపీ, ఎంఐఎం పార్టీలకు సొంతంగా పోటీ చేసే బలం లేకపోవడం వల్ల వారి ఇచ్చే మద్దతు కీలకంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల మద్దతు కూడా అత్యంత ప్రధానంగా చెబుతున్నారు.

వలస ఎమ్మెల్యేలతో కలుపుకుని నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే బీఆర్ఎస్ ఆరో అభ్యర్థిని పోటీలోకి పెట్టి వలస ఎమ్మెల్యేలను భయపెట్టాలని చూస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రహస్య పద్ధతిలో జరిపినా, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం పార్టీలకు ఉంటుంది. దీంతో తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన పది మంది ఎమ్మెల్యేలు తమ విప్ ను పాటించాల్సివుంటుందని బీఆర్ఎస్ ఎత్తులు వేస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీని అనుసరించి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బలంతో ఏ ఇబ్బంది లేకుండా ఓ స్థానాన్ని గెలుచుకోవచ్చు. కానీ, మరో అభ్యర్థిని పోటీకి పెట్టి ద్వితీయ ప్రాధాన్యం లెక్కింపు తేవాలని అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ ఊడత ఊపులకు భయపడేది లేదని చెబుతోంది. తమ ఎమ్మెల్యేలు 79 మందితోపాటు ఏడుగురు ఎంఐఎం సభ్యుల అండతో కచ్చితంగా నాలుగు సీట్లు గెలుచుకుంటామంటోంది. బీఆర్ఎస్ కనుక ఆరో అభ్యర్థిని పోటీకి పెట్టకపోతే అసలు ఎన్నిక జరిగే పరిస్థితే ఉండదు. కానీ, బీఆర్ఎస్ ఆరో అభ్యర్థిని పెడుతుందనే ప్రచారం మాత్రం తెలంగాణ రాజకీయాన్ని అలర్ట్ చేస్తోంది. దీంతో రానున్న రెండు వారాల రాజకీయం హైవోల్టేజ్ కు చేరుకుంటుందని అంటున్నారు.