Begin typing your search above and press return to search.

అమెరికా నుంచి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు జంప్..ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటికే పోలీసులకు కొరకరాని కొయ్యలా మారిన ఈ కేసు మరిన్ని సవాళ్లు విసురుతోంది

By:  Tupaki Desk   |   7 March 2025 2:52 PM IST
అమెరికా నుంచి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు జంప్..ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!
X

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటికే పోలీసులకు కొరకరాని కొయ్యలా మారిన ఈ కేసు మరిన్ని సవాళ్లు విసురుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలో దాక్కున్న ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లను అరెస్ట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికా నుంచి జంప్ అయినట్టు తెలుస్తోంది. బెల్జియంలో శ్రవణ్ రావు, కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్లు సమాచారం.

రాజకీయంగా ప్రకంపనలు రేకెత్తించిన ఈ కేసు కొలిక్కి వచ్చినట్టేనని భావిస్తున్న తరుణంలో నిందితులు ఇతర దేశాలకు జంప్ అయ్యారు. వీరిని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన పత్రాలతో సంతృప్తి చెందిన సీబీఐ వారికి తనవంతుగా సాయం అందించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐ ఇంటర్ పోల్ ను కోరింది. దీంతో సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ కు రెడ్ కార్నర్ నోటీసులు చేరుకున్నాయి.

అనంతరం స్పందించిన ఇంటర్ పోల్ అధికారులు..196 దేశాల ప్రతినిధులను అలెర్ట్ చేయనున్నారు. అయితే ఇప్పటికే నిందితులు ఇద్దరూ అమెరికా వీడారు. మరి ఇద్దరినీ అరెస్ట్ చేయడం సులభమవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం వల్ల నిందితులు ఏ దేశంలో దాక్కున్న వారిని అరెస్ట్ చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. వారు ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా..అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకు రావడం తథ్యమని అంటున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు ఎస్ఐబీ మాజీ చీఫ్. రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ(ఓస్డీ). కాగా, కేసులో ప్రధాన నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయారు. మిగతా నిందితులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా , పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావే అని తేలింది. అయితే ఇందులో ప్రభాకర్ రావే కీలక నిందితుడా? మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావును విచారిస్తేనే మరిన్ని విషయాలు వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు.