Begin typing your search above and press return to search.

ఉప ఎన్నికలు వస్తే తట్టుకోగలమా? జంపింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు

వేసవి ఎండలతోపాటు తెలంగాణ రాజకీయం కూడా వేడెక్కుతోంది. రోజురోజుకు టెంపరేచర్ పెరిగిపోతోంది.

By:  Tupaki Desk   |   7 Feb 2025 6:30 PM GMT
ఉప ఎన్నికలు వస్తే తట్టుకోగలమా? జంపింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు
X

వేసవి ఎండలతోపాటు తెలంగాణ రాజకీయం కూడా వేడెక్కుతోంది. రోజురోజుకు టెంపరేచర్ పెరిగిపోతోంది. వలస ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులు కేసు వేసింది. దీనిపై 10వ తేదీ సోమవారం విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పు వస్తే పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదేసమయంలో సుప్రీం నోటీసులతోపాటు అసెంబ్లీ సెక్రటరీ షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఎమ్మెల్యేల్లో గుబులు ఎక్కువ అవుతోంది. దీంతో మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో సమావేశమైన ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వస్తే తట్టుకునే పరిస్థితులపై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆందోళనతో ఉన్నట్లు చెబుతున్నారు.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో మూడు రంగుల కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా, వారు పార్టీ మారడం అనైతకమని ఆరోపిస్తూ.. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పోరాడుతోంది. ఇటు శాశనసభ స్పీకరుకు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో రిట్ పిటిషన్లు వేసింది. ఇప్పటికే వీరి అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పీకరుకు సూచించింది. అయితే హైకోర్టు ఆదేశాలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ సుప్రీంకోర్టు తలుపుతట్టింది. మొత్తం పది మంది అనర్హతపై ఒకేసారి విచారణ చేస్తామని తెలిపిన కోర్టు, సోమవారం విచారించనుంది. సుప్రీం యాక్షన్ తో ఎమ్మెల్యేల్లో టెన్షన్ ఎక్కువవుతోందని చెబుతున్నారు.

అసెంబ్లీ సెక్రటరీకి ఏదో ఒక వివరణ ఇవ్వొచ్చని, కానీ, సుప్రీంకోర్టుకు ఎలా సమాధానమివ్వాలనే విషయమై ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా చర్చించారు. న్యాయ సలహా తీసుకున్నారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. కాంగ్రెస్ గుర్తుపై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆయన సుప్రీం విచారణ నుంచి తప్పించుకోలేరని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా కొన్ని అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలుగా వ్యవహరించడం, ఆ పార్టీకి అనుకూలంగా, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో ఆధారాలు ఉన్నాయంటున్నారు. దీంతో పది మందిపై అనర్హత వేటు పడితే ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అన్నదానిపై ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆలోచిస్తున్నారని అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు వెళితే.. మళ్లీ గెలిచి శాసనసభలో అడుగుపెట్టగలమా? లేదా? అనేది తమ అనుచరుల వద్ద ఆరా తీస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది? బీఆర్ఎస్ ఏమైనా పుంజుకుందా? వంటి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం నిర్ణయం మరికొంత ఆలస్యమయ్యేలా న్యాయ పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. తక్షణం తీర్పు వచ్చే కన్నా, ఆ తీర్పు మరికొన్నాళ్లు వాయిదా పడేలా పావులు కదపాలని న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల తాము కొంత తేరుకుని ఎన్నికలు వచ్చినా పోరాడగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు అనర్హత టెన్షన్ నిద్ర పట్టనీయడం లేదని చెబుతున్నారు.