షోలు, రేట్లు.. ఆంధ్ర సరే, తెలంగాణ సంగతేంటి??
ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు అనుమతులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 30 Dec 2024 7:47 PM GMTసంక్రాంతి సినిమాలకు సమయం దగ్గర పడుతోంది. ఇంకో 11 రోజుల్లోనే 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత రెండు రెండు రోజుల గ్యాప్‌లో 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు కూడా విడుదలవుతాయి. ఐతే ఈ చిత్రాలకు తెలంగాణలో షోలు ఎప్పుడు మొదలవుతాయి.. ఇక్కడ టికెట్ల ధరలు ఎలా ఉండబోతున్నాయి అన్నది సస్పెన్సుగా మారింది. నెల కిందటి వరకు ఇలాంటి అయోమయం ఏమీ లేదు.
కోరిందే తడవుగా తొలి వారం అదనపు షోలు, రేట్లకు అనుమతులు వచ్చేస్తుండేవి. కానీ 'పుష్ప-2' రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతరం పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు అనుమతులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఆ తర్వాత మంత్రి కోమటి రెడ్డి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
ఐతే ఇండస్ట్రీ పెద్దలు మాత్రం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకుంటుందనే ఆశాభావంతో కనిపించారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు దిల్ రాజు ఈ విషయంలో రాయబారం నడిపి సర్దుబాటు చేస్తారని అనుకున్నారు. కానీ ఇటీవల సీఎంతో జరిగిన సినీ ప్రతినిధుల సమావేశంలో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల వ్యవహారం చర్చకే రాలేదు. రాజు బృందం ఆ విషయం ప్రస్తావించలేని పరిస్థితి కనిపించింది. మీటింగ్ తర్వాత విలేకరులు అడిగితే అది చాలా చిన్న విషయం అంటూ సమాధానం దాటవేశారు రాజు.
సమావేశం అజెండా ఏదైనప్పటికీ.. అంతిమంగా ఈ నిర్ణయం మార్చేలా సీఎంకు సర్దిచెప్పాలని అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇప్పుడేమో రాజుకు అదనపు షోలు, రేట్లు చాలా అవసరం. 'గేమ్ చేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాల నిర్మాత ఆయనే. 'డాకు మహారాజ్'కు నైజాంలో డిస్ట్రిబ్యూటరూ ఆయనే. ఈ చిత్రాలపై భారీ పెట్టుబడులు పెట్టిన ఆయన.. అదనపు షోలు, రేట్లు లేకుండా గట్టెక్కడం కష్టం.
ఓవైపు ఆంధ్రాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన రాజు.. అక్కడ అదనపు షోలు, రేట్లకు ఈజీగానే అనుమతులు తెచ్చుకోబోతున్నారు. కానీ తెలంగాణలో పరిస్థితి ఏంటన్నదే ప్రశ్నార్థకం. రాజుకు ఇక్కడి ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పడు వారి మనసు మారొచ్చేమో కానీ.. అసెంబ్లీలో సీఎం, మీడియా ముందు మంత్రి ప్రకటన చేశాక ఇంత త్వరగా వెనక్కి తగ్గితే అది ప్రభుత్వానికి ఇబ్బంది. మరి ఈ పరిస్థితుల్లో సంక్రాంతి సినిమాలకు నైజాంలో అదనపు షోలు పడతాయా.. రేట్లు పెరుగుతాయా లేదా అన్నది సస్పెన్సుగా మారింది.