తెలంగాణ టీడీపీ బాధ్యతలు కృష్ణయ్యకా... !
హైదరాబాద్‌కు వెళ్లిన ప్రతిసారీ.. ఆర్. కృష్ణయ్యతో మంతనాలు సాగించారని సమాచారం.
By: Tupaki Desk | 16 Nov 2024 10:40 AM GMTఇది కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. నిజమేనని తెలుస్తోంది. టీడీపీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు.. బీసీ ఉద్యమ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ మాజీ నాయకుడు ఆర్. కృష్ణయ్య రేపోమాపో.. టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకురెడీ అయ్యారని సమాచారం. ఇప్పటికే రెండు దఫాలుగా ఆయనతో చంద్రబాబు రహస్య చర్చలు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్‌కు వెళ్లిన ప్రతిసారీ.. ఆర్. కృష్ణయ్యతో మంతనాలు సాగించారని సమాచారం.
ఈ క్రమంలో రెండు సార్లు కృష్ణయ్య భౌతికంగా చంద్రబాబుతో భేటీ అయ్యారన్నది కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలోనే అంటే.. 2014 ఎన్నికల సమయంలోనే కృష్ణయ్య టీడీపీలో ఉన్నారు. అప్పటి ఎన్నికల్లో ఆయన ఎల్‌బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేశారు. అంతేకాదు.. అప్పటి ఎన్నికల్లో టీడీపీ విజయం దక్కించుకుని ఉంటే.. ఆయనే ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు. ఈ విషయాన్ని చంద్రబాబే అప్పట్లో స్వయంగా ప్రకటించారు.
అయితే.. ఆయన పరాజయం పాలవడం.. తర్వాత.. వైసీపీ కి చేరువ కావడం తెలిసిందే. ఈ క్రమంలోనే 2021లో జగన్.. కృష్ణయ్యను ఏరికోరి బీసీ కోటాలో రాజ్యసభకు పంపించారు. కొన్నాళ్ల కిందటి వరకు కూడా ఆయన వైసీపీలోనే ఉన్నారు. అయితే.. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించిన తర్వాత నుంచి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయి.. కృష్ణయ్య యూటర్న్ తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయన తిరిగి సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి చంద్రబాబు కూ డా సమ్మతించినట్టు తాజాగా వెలుగు చూస్తున్న సమాచారం. ప్రస్తుతం.. తెలంగాణలో టీడీపీని బలోపే తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే కృష్నయ్యకు ఏకంగా.. తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగిస్తారని.. ఈమేరకు చర్చలు కూడా పూర్తయ్యాయన్నది సమచారం.
బీసీ నేతకు పగ్గాలు అప్పగించడం ద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా ఉంది. గతంలో కూడా బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు పగ్గాలు అప్పగించారు. అయితే.. ఆయన బీఆర్ ఎస్ పంచన చేరిపోయారు. ఇప్పుడు మరోసారి కీలకనేతగా ఉన్న కృష్ణయ్యవైపు చంద్రబాబు చూస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందోచూడాలి.