Begin typing your search above and press return to search.

తెలంగాణ తల్లి కొత్త రూపం ఇదే..

తెలంగాణ రాష్ట్రం అస్తిత్వానికి, స్వాభిమానానికి, సాధికారతకు ప్రతీక తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి ప్రస్తావన పూర్వకాలం నాటిదే అని చెప్పాలి

By:  Tupaki Desk   |   6 Dec 2024 11:01 AM GMT
తెలంగాణ తల్లి కొత్త రూపం ఇదే..
X

తెలంగాణ రాష్ట్రం అస్తిత్వానికి, స్వాభిమానానికి, సాధికారతకు ప్రతీక తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి ప్రస్తావన పూర్వకాలం నాటిదే అని చెప్పాలి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కాలంలోనే ఎందరో కవులు తెలంగాణ తల్లి పేరును ప్రస్తావిస్తూ పద్యాలు, పాటలు రచించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణ తల్లి.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరోసారి ఊపిరి పోసుకుంది.

సమైక్యవాదులు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు విరుద్ధంగా, సమైక్య రాష్ట్ర ప్రతీకగా తెలుగు తల్లిని నిలపే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సాహిత్యకారులు, కళాకరులు తెలంగాణ తల్లి రూపురేఖలను గుర్తించి చర్చలు పెట్టారు. దాని తరువాత తెలంగాణ తల్లిని ఇప్పటివరకు ఉన్న విగ్రహం మాదిరి రూపొందించారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలోనూ.. రాష్ట్రం సిద్ధించాక కూడా చాలా వరకు గ్రామాల్లో స్వచ్ఛందంగా తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించారు.

సమైక్య రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీకగా తెలుగుతల్లి విగ్రహం గతంలో సెక్రటేరియట్ ముందు ఉండేది. స్వరాష్ట్రం వచ్చాక కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణం పూర్తయ్యాక ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ.. ఇంతలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. అయితే.. తెలంగాణ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండడం చారిత్రక న్యాయమని గతంలోనే నిర్ణయించారు.

ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ కవులు, కళాకారులు, పాత్రికేయుల పక్షాన శ్రీరాహుల్‌గాంధీకి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో మూడు రోజుల్లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. అయితే.. గతంలో ఉన్న మాదిరి విగ్రహం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విగ్రహంలో మార్పులు తీసుకొచ్చారు.

అయితే.. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారుస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. కొత్త విగ్రహం ఎలా రూపుదిద్దుకోబోతోంది.. ఎలా ఉండబోతోంది.. అన్న చర్చ సాగింది. మరో మూడు రోజుల్లోనే ప్రతిష్ఠాపనకు నోచుకోనున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం నమూన బయటకు వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఉన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. ఈనెల 9న సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం ఫొటో వైరల్ అయింది. ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మొక్కజొన్న కంకులు పట్టుకున్న రూపంలో విగ్రహం దర్శనమిచ్చింది. ఈ విగ్రహాన్ని 9న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.