Begin typing your search above and press return to search.

ప్రజలు ఏమనుకుంటారో?

ఎక్కడైనా ప్రభుత్వాలు మారితే పథకాలు మారతాయి.. కార్యక్రమాలు మారతాయి.. లక్ష్యాలు మారుతాయి.. తెలంగాణలో ఈసారి ‘విగ్రహం’ మారింది

By:  Tupaki Desk   |   7 Dec 2024 12:30 PM GMT
ప్రజలు ఏమనుకుంటారో?
X

ఎక్కడైనా ప్రభుత్వాలు మారితే పథకాలు మారతాయి.. కార్యక్రమాలు మారతాయి.. లక్ష్యాలు మారుతాయి.. తెలంగాణలో ఈసారి ‘విగ్రహం’ మారింది. ఉద్యమ కాలంలో వెలుగులోకి వచ్చి.. బీఆర్ఎస్ హయాంలో అదే తెలంగాణ తల్లి విగ్రహంగా పూజలందుకున్న విగ్రహం ఇప్పుడు తెరమరుగు కానుంది. ఈ నెల 9న తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించనుంది. ఇదే రోజు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ పుట్టిన రోజు కావడం గమనార్హం. అంతేకాదు.. 2009లో.. తెలంగాణ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన రోజు కూడా.

నిలువెత్తు తెలంగాణ..

తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని 17 అడుగులతో రూపొందించారు. తెలంగాణ తల్లి అంటే విగ్రహం కాదు.. తెలంగాణ ప్రజల అస్తిత్వం. ఇక్కడి ప్రజల మాతృమూర్తి. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యాన్ని, పోరాట స్ఫూర్తిని అది చాటాలి. సంప్రదాయ స్త్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్ఫూర్తిగా అందరినీ ఆకట్టుకోవాలి అని వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, మేధావుల సలహాలు సూచనల మేరకు దీనిని రూపొందించింది. దీంతో తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా.. ప్రసన్న వదనంతో ఉండే నిండైన రూపం, కుడి చేతితో అభయ హస్తం.. ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్య పంటలైన వరి గోధుమ తదితరాలను పట్టుకుని, గ్రామీణ జీవన విధానం, వ్యవసాయ ప్రాధాన్యతను చాటేలా కొత్త విగ్రహాన్ని తయారు చేశారు.

ఆకుపచ్చ రంగు చీర పచ్చని పంటలను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణ ధీర వనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. విగ్రహ పీఠంలో.. తెలంగాణ తల్లికి దాస్య విముక్తి కల్పించిన బిడ్డల పోరాటాలకు ప్రతీకగా పిడికిళ్లను ఉంచారు.

రెండు విగ్రహాలకు తేడాలివే...

-పాత తెలంగాణ తల్లి విగ్రహంలో జరీ అంచు పట్టు చీర ధరించగా.. కొత్తదాంట్లో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ఉంది.

- గత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా.. ఇప్పుడు కిరీటం ఉన్నప్పటికీ బతుకమ్మ లేదు.

- బంగారు గాజుల స్థానంలో మట్టి గాజులు వచ్చాయి.

- వెండి మెట్టెలు, నగలు కిరీటం పోయి.. మెడలో కంటి ఆభరణం మాత్రమే కనిపిస్తోంది.

-పాత విగ్రహంలో కుడి చేతిలో మొక్కజొన్నలు ఉండగా.. కొత్త విగ్రహంలో అభయ హస్తం కనిపిస్తోంది. ఎడమ చేతిలో బతుకమ్మ స్థానాన్ని వరి, జొన్న, సజ్జ కంకులు ఆక్రమించారు.

-ధనిక, సాధారణ నేపథ్యం.. అన్నిటి కంటే రెండు విగ్రహాల రూపాల్లో స్పష్టమైన తేడా.

ఒకే ఊరిలో రెండు విగ్రహాలు..?

బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ సమయంలో తమ పార్టీ లక్ష్యాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది. అధికారంలోకి వచ్చాక కూడా దానినే తెలంగాణ తల్లి విగ్రహంగా కొనసాగిస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తాము వచ్చాక విగ్రహాన్ని మార్చాలని నిర్ణయించింది. ఇప్పుడు అసలు ప్రశ్న.. తెలంగాణలో చాలాచోట్ల ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్ఠించిన విగ్రహాలు ఉన్నాయి. మరిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తే పరిస్థితి ఏమిటా? అని.

ప్రజలు ఏమనుకుంటారో?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ఇక్కడి ప్రజల దశాబ్దాల కోరిక. అది నెరవేరి కూడా దశాబ్దం అయింది. ఇప్పుడిక తెలుగు రాష్ట్రాల్లో వేటి దారి దానిదే. ప్రజల్లో కూడా ఉద్యమ కాలం నాటి ఉద్వేగాలు తగ్గాయి. ఇలాంటి సమయంలో తెలంగాణలో ‘విగ్రహం’ అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహం. తెలంగాణ తల్లిలా లేదని.. కాంగ్రెస్ తల్లిలా ఉందని బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ విమర్శించారు. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో కానీ.. ఇప్పటికైతే ఈ అంశంపై ప్రజలకు పెద్దగా ఆసక్తి లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరి బీజేపీ వస్తే..?

వచ్చేసారి తెలంగాణలో తమదే అధికారం అని బీజేపీ చెబుతోంది. మరి అదే జరిగితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహాలను కొత్త విగ్రహాన్ని రూపొందిస్తుందా? అలాగైతే.. ఒకే రాష్ట్రానికి ముగ్గురు తల్లులు కారా.?? అనే ప్రశ్న వస్తోంది.

కొసమెరుపు: గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన ప్రొఫెసర్ గంగాధర్‌ నేతృత్వంలో ప్రముఖ రూపశిల్పి ఎంవీ రమణారెడ్డి తెలంగాణ తల్లి ప్రస్తుత కాంస్య విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఎంవీ రమణారెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ అమరజ్యోతి, సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహాలు ఆయన రూపొందించినవే.