Begin typing your search above and press return to search.

మాకే ఫైన్ వేస్తారా.. పోలీసోళ్లకు ‘షాక్’ ఇచ్చిన కరెంటోళ్లు

మెదక్ జిల్లాలో విద్యుత్‌శాఖ ఉద్యోగులు ట్రాఫిక్‌ సిగ్నళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన ఘటన కలకలం రేపింది.

By:  Tupaki Desk   |   20 Feb 2025 10:55 AM GMT
మాకే ఫైన్ వేస్తారా.. పోలీసోళ్లకు ‘షాక్’ ఇచ్చిన కరెంటోళ్లు
X

కరెంటోళ్లకే ఫైన్ వేస్తారా? మీ సంగతి చెబుతాం అని ఏకంగా ట్రాఫిక్ పోలీసులకు షాక్ ఇచ్చారు ట్రోన్స్ కో సిబ్బంది. వారి సిగ్నల్స్ కే విద్యుత్ సరఫరా కట్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మెదక్ జిల్లాలో విద్యుత్‌శాఖ ఉద్యోగులు ట్రాఫిక్‌ సిగ్నళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన ఘటన కలకలం రేపింది. "మేం కరెంటోళ్లం.. మాకే ఫైన్ వేస్తారా?" అనే ధోరణిలో విద్యుత్‌శాఖ అధికారులు ఇలా ఝలక్ ఇచ్చారు.

గత 14న మెదక్ పట్టణంలో ముగ్గురు ట్రాన్స్ కో సిబ్బంది బైక్‌పై ప్రయాణిస్తుండగా, ట్రాఫిక్ పోలీసులు ఫోటో తీసి జరిమానా విధించారు. దీనిపై ట్రాన్స్ కో అధికారులకు అసంతృప్తి వ్యక్తం చేశారు.. తమ విద్యుత్‌తో నడిచే సిగ్నళ్ల వద్దే తమకు జరిమానా వేయడం సరికాదని భావించి, రాందాస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

18, 19 తేదీల్లో సిగ్నళ్లు పనిచేయకపోవడంతో పోలీసులు ఇది సాంకేతిక లోపమని భావించారు. అయితే, బుధవారం నిర్వహించిన పరిశీలనలో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు గుర్తించారు. ట్రాన్స్ కో ఏఈ నవీన్‌తో సంప్రదించగా, విధి నిర్వహణలో వెళ్తున్న తమ సిబ్బందికి జరిమానా విధించడం అన్యాయమని, ట్రాఫిక్‌ సిబ్బంది వారి వాదనను వినకపోవడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు.

అయితే, ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం నిబంధనలు అందరికీ వర్తిస్తాయని, ట్రాన్స్ కో సిబ్బందికి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. మరింత విచారణ అనంతరం ట్రాన్స్ కో అధికారులు ట్రాఫిక్‌ సిగ్నళ్ల విద్యుత్‌ సరఫరాను కావాలనే నిలిపివేసినట్లు నిర్ధారణ అయ్యింది.

ఈ ఘటనపై విద్యుత్‌శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా అధికార దుర్వినియోగం చేయడం ఏమాత్రం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.