Begin typing your search above and press return to search.

విస్తరణ జరిగితే విస్ఫోటనమేనా ?!

బీఆర్ఎస్ నుండి ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే మరో 16 మంది చేరాలి. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   26 July 2024 8:30 AM GMT
విస్తరణ జరిగితే విస్ఫోటనమేనా ?!
X

ఆషాడమాసం వెళ్లి శ్రావణమాసం రావడానికి మిగిలింది 9 రోజులు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా అప్పటికి 9 నెలలు అవుతుంది. అప్పటికయినా ప్రభుత్వంలో మిగిలిపోయిన ఆరు మంత్రి పదవులను భర్తీ చేసే వ్యవహారం తేలుతుందా ? లేదా ? అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడం, మంత్రి పదవులు తక్కువగా ఉండడంతో ఈ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. అదే సమయంలో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కూడా ఈ ఖాళీలను భర్తీ చేయడం లేదని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. బీఆర్ఎస్ నుండి ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే మరో 16 మంది చేరాలి. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు.

పార్టీలో చేరమని అడిగితే ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి మాత్రమే కావాలని షరతులు పెడుతున్నట్లు సమాచారం. ఇది కాకుండా ఇప్పటి వరకు చేరిన వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, చేరిన తర్వాత పట్టించుకోవడం లేదన్న వార్తల నేపథ్యంలో చేరికలకు గ్యాప్ ఏర్పడినట్లు చెబుతున్నారు.

బీఆర్ఎస్ నుండి అందరికన్నా ముందు చేరిన దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే తాను మంత్రి పదవి హామీతోనే కాంగ్రెస్ లో చేరానని లేకుంటే ఎంపీకి ఎందుకు పోటీ చేస్తానని అంటున్నట్లు తెలుస్తుంది. జంటనగరాల నుండి మంత్రుల ప్రాతినిధ్యం లేకపోవడంతో పాటు మైనారిటీ మంత్రి కూడా లేని నేపథ్యంలో దానంతో పాటు, ఇటీవల కంటోన్మెంట్ నుండి గెలిచిన ఎమ్మెల్యే శ్రీగణేష్ మంత్రి పదవి ఆశిస్తున్నారు.

ఇక సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ తనను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను నమ్మకంగా ఉన్నానని, పలుమార్లు పోటీ చేశానని, ఇటీవల కేవలం 2037 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయానని మైనారిటీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని, కార్పోరేషన్ అక్కర్లేదని ఫిరోజ్ ఖాన్ అంటున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో క్రికెటర్ అజారుద్దీన్ కూడా పదవిని ఆశిస్తున్నాడు. అయితే దానం రోజూ సీఎం రేవంత్ ఇంటికి వెళ్తున్నా ఈ మధ్య కాలంలో అసలు కలవడం లేదని తెలుస్తుంది.

ఇక ఎస్టీ కోటాలో బాలూ నాయక్, వెడ్మ బొజ్జు, ముదిరాజ్ కోటాలో వాకిట శ్రీహరి, యాదవ కోటాలో బీర్ల అయిలయ్య మంత్రి పదవులు ఆశిస్తున్నారు. తనకు ఇచ్చిన హామీ ప్రకారమే కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఆ తర్వాత పెట్టిన షరతు ప్రకారం భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపించిన నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే తన సతీమణి పద్మావతికి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నారు.

ఇక నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ నుండి చెన్నూర్ ఎమ్మెల్యే వివేకం పదవులను ఆశిస్తున్నారు. వివేక్ తన బెర్త్ ఖాయం అని చెప్పుకుంటున్నారు. వివేక్ కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యే, ఒక ఎంపీకి అవకాశం లభించిన నేపథ్యంలో పార్టీకి లాయల్ గా ఉన్న తనకు మంత్రి పదవి ఇవ్వాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పట్టుబడుతున్నాడు.

ఇక సీనియర్ల కోటాలో ఇబ్రహీంపట్నం నుండి మల్ రెడ్డి రంగారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు ఆశావాహుల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఇంత మంది ఆశావాహులు ఉండగా బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికి పదవులు ఇస్తే కాంగ్రెస్ లో కాకరేగడం ఖాయం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి అసలు మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది ? ఎవరికి అవకాశాలు దక్కుతాయి ? ఆ తర్వాత ఏం జరుగుతుంది ? అన్నది వేచిచూడాలి.