Begin typing your search above and press return to search.

సమీక్ష.. స్టడీ.. స్వేచ్ఛ.. సబ్జెక్ట్.. అసెంబ్లీ.. సూపర్ హిట్ ’అమాత్య’

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 15 రోజుల్లోనే పాలన ఎలా ఉండబోతున్నదో స్పష్టమైంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 12:30 AM GMT
సమీక్ష.. స్టడీ.. స్వేచ్ఛ.. సబ్జెక్ట్.. అసెంబ్లీ.. సూపర్ హిట్ ’అమాత్య’
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 15 రోజుల్లోనే పాలన ఎలా ఉండబోతున్నదో స్పష్టమైంది. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలోని లోపాలను ప్రస్తావిస్తూ.. ఐదేళ్లలో ఏం చేయదల్చుకున్నారో చూచాయగా తెలిసిపోయింది. కేవలం 10-15 రోజులకే సర్టిఫికెట్ ఇచ్చేస్తారా? అనుకోవద్దు. అన్నం ఉడికిందా లేదా చూసేందుకు ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలు.. అలాగే కాంగ్రెస్ సర్కారు పాలనలో ఎలా ఉండబోతున్నదో చెప్పేందుకు ఈ సమయం చాలు. అయితే, చెప్పిన ఈ మేరకు వారు పాలన సాగించకుంటే అది వారి వైఫల్యమే అవుతుందనే సంగతి గుర్తుంచుకోవాలి.

బీఆర్ఎస్ మంత్రులు.. వర్సెస్ కాంగ్రెస్ మంత్రులు

తెలంగాణ వచ్చాక ఇప్పటివరకు తొమ్మిదిన్నరేళ్లు ఏకైక (బీఆర్ఎస్) ప్రభుత్వాన్ని చూశారు ప్రజలు. దీంతో ఒకే తరహా పాలనకు అలవాటు పడ్డారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. అందులోనూ కేసీఆర్ కనుసన్నల్లో నడిచే పార్టీ. దానికితోడు ఆయన వారసుడు కేటీఆర్ పార్టీ, ప్రభుత్వంలో నంబర్ 2 అనే స్థానంలో ఉన్నారు. దీంతోనే బీఆర్ఎస్ హయాంలో మంత్రులకు స్వేచ్ఛ లేదు. నిర్ణయాలన్నీ సెంట్రలైజ్డ్ గా ఉండేవి. కేసీఆర్ ఏం చెబితే అదే మంత్రి వర్గ తీర్మానంగా ఉండేది. కానీ, తెలంగాణ వచ్చాక తొలిసారి ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

విద్యావంతులు..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులందరూ దాదాపు ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సెంట్రల్ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో చదివారు. దామోదర రాజనర్సింహ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్మీలో యుద్ధ విమాన పైలట్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంజనీర్. పొన్నం ప్రభాకర్ ఎల్ఎల్ బీ చేశారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా న్యాయ శాస్త్రం చదివారు. సీతక్క పీహెచ్ డీ ఎల్ఎల్ బీ తర్వాత పీహెచ్ డీ కూడా చేశారు. ఈ లెక్కన తెలంగాణ గత ప్రభుత్వంలోని మంత్రుల కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే విద్యావంతులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవారు కావడం విశేషం.

నిర్ణయాల్లో స్వేచ్ఛ

బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కావడం, కేసీఆర్ కు తెలియకుండా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. స్వేచ్ఛ ఇస్తే ఏమవుతుందోన్న ఉద్దేశంలో కేసీఆర్ సైతం ఈ దిశగా స్పష్టమైన నియంత్రణ రేఖ గీసినట్లుగా భావింవచ్చు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో సహజంగానే మంత్రులకు స్వేచ్ఛ లభిస్తుంది. కాగా, ప్రస్తుత మంత్రుల్లో సబ్జెక్ట్ పై అధ్యయనం చేస్తున్నారని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తేలిపోయింది.

మళ్లీ ఆనాటి రోజులు..

2004-14 మధ్యన ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మంత్రులుగా సీనియర్ నేతలు ఉండేవారు. ముఖ్యంగా వైఎస్ సర్కారులో జానారెడ్డి, దివాకర్ రెడ్డి, రఘువీరారెడ్డి తదితరులు మంత్రులుగా చేశారు. ఆ సమయంలో మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రులు కూడా శాఖల వారీగా సమీక్ష, అధ్యయనం, స్వేచ్ఛగా ఉండడం, అసెంబ్లీలో ప్రతిపక్షానికి దీటుగా మాట్లాడడం చూస్తుంటే నాటి రోజులు గుర్తొస్తున్నాయి. అయితే, మరో ఐదేళ్లు ఇలాగే సమర్థంగా ఉంటారా? అనేది కాలమే చెప్పాలి.