Begin typing your search above and press return to search.

8 వారాలు అసెంబ్లీకి రాలేని స్థితిలో పార్టీ శాసనసభా పక్ష నేత.. కిం కర్తవ్యం?

గత ఆదివారం ఫలితాల వెల్లడి అనంతరం తెలంగాణ ఎన్నికల అంకం పూర్తయింది.. తర్వాతి రోజు కొత్త అసెంబ్లీ ఏర్పడినట్లుగా ప్రకటన వెలువడింది

By:  Tupaki Desk   |   9 Dec 2023 11:45 AM GMT
8 వారాలు అసెంబ్లీకి రాలేని స్థితిలో పార్టీ శాసనసభా పక్ష నేత.. కిం కర్తవ్యం?
X

గత ఆదివారం ఫలితాల వెల్లడి అనంతరం తెలంగాణ ఎన్నికల అంకం పూర్తయింది.. తర్వాతి రోజు కొత్త అసెంబ్లీ ఏర్పడినట్లుగా ప్రకటన వెలువడింది. గురువారం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రభుత్వం ఏర్పడింది. మిగిలింది శాసన సభ్యుల ప్రమాణ స్వీకారమే. దీనికి శనివారం వేదికైంది. అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ గా ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.

కేసీఆర్ ఎప్పుడొస్తారు..?

ముఖ్యమంత్రి హోదాలో మొన్నటివరకు అసెంబ్లీ సభా నాయకుడిగా వ్యవహరించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ ఏర్పాటు నుంచి ఆయనే సభా నాయకుడు. కానీ, ఈసారి కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇటీవల ఫలితాల్లో బీఆర్ఎస్ పరాజయంతో ఆయన ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, దీనికితోడు గురువారం అర్ధరాత్రి అనూహ్యంగా కేసీఆర్ జారిపడడంతో తుంటి ఎముక విరిగింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో సర్జరీ చేశారు. దీంతోపాటే 6 నుంచి 8 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.

మరి ఎమ్మెల్యేగా ప్రమాణం ఎప్పుడు?

తెలంగాణ శాసన సభ ఎమ్మెల్యేల్లో అత్యధికులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, కేసీఆర్ మాత్రం రాలేకపోయారు. అయితే, ఆయనను బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకుంది. కేసీఆర్ ఆదేశాలతోనే శనివారం ఉదయం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. తుంటి సర్జరీకి వెళ్లడానికి ముందే.. కేటీఆర్, హరీశ్ రావుకు శాసన సభా పక్ష సమావేశం నిర్వహించాలని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. కేసీఆర్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్‌ ను తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి వెళ్లారు. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యేలు పద్మారావు, ముఠా గోపాల్‌ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి రాలేదు. కేసీఆర్ కు సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ రాలేదు. తనకు మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని ఆయన కోరారు.

కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేదెప్పుడో..?

6 నుంచి 8 వారాలు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించిన నేపథ్యంలో కేసీఆర్ దాదాపు ఫిబ్రవరి వరకు బయటకు రానట్లే. అంటే.. బీఆర్ఎస్ ఎల్పీ పక్ష నేతగా కేసీఆర్ ఎన్నికైనా ఇప్పట్లో అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సెషన్ లోనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంటుంది. విజయం సాధించిన రెండు నెలల తర్వాతనే ఆయన అసెంబ్లీ మెట్లెక్కనున్నారు. కాగా, ప్రస్తుత సమావేశాలు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతోనే ముగియనున్నట్లు తెలుస్తోంది. లేదంటే శీతాకాల సమావేశాల కింద పూర్తిస్థాయిలో జరగొచ్చు. పూర్తి స్థాయి సమావేశాలు అంటే ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాలే అనుకోవాలి. కేసీఆర్ అప్పుడే ప్రమాణ స్వీకారం చేసి.. బీఆర్ఎస్ పక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించే వీలుంది.