Begin typing your search above and press return to search.

బీజేపీ టార్గెట్...అయ్యేపనేనా ?

అంత పెద్ద టార్గెట్ పెట్టుకుంటే అందులో కనీసం సగమన్నా అందుకుంటామన్న ప్రాక్టికాలిటి అయ్యుండచ్చు

By:  Tupaki Desk   |   4 Aug 2023 5:31 AM GMT
బీజేపీ టార్గెట్...అయ్యేపనేనా ?
X

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ పెద్ద టార్గెట్టే పెట్టుకున్నది. టార్గెట్ రీచవ్వటం సాధ్యమేనా కాదా అన్న లాజిక్ ఆలోచించుకున్నట్లు లేదు. లేదూ అంత పెద్ద టార్గెట్ పెట్టుకుంటే అందులో కనీసం సగమన్నా అందుకుంటామన్న ప్రాక్టికాలిటి అయ్యుండచ్చు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణా నేతలతో విడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే టార్గెట్ 75 పేరుతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అందించారు.

లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే విషయంలో ఆసక్తి కనబరుస్తున్న నేతలు, ఇప్పటి ఎంపీలు, సీనియర్ నేతలంతా విధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాల్సిందే అని అమిత్ స్పష్టంగా చెప్పేశారట. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్ధానాలకు పోటీచేసేంత స్ధాయి ఉన్న నేతలను సుమారు 30 మందిని గుర్తించారు. అలాంటి వాళ్ళల్లో కచ్చితంగా గెలుస్తారు, ప్రత్యర్ధులకు ధీటైన పోటీ ఇవ్వగలరు అని అనిపించిన వాళ్ళందరినీ అసెంబ్లీ బరిలోనే దిగాలని అమిత్ చెప్పేశారు.

అలాగే 119 స్దానాల్లో కనీసం 75 నియోజకవర్గాల్లో గెలుపును టార్గెట్ గా పెట్టుకోవాలని చెప్పారు. ఏ నేత ఏ నియోజకవర్గంలో పోటీచేయాలనే విషయాన్ని తొందరలోనే కేంద్ర కమిటి నిర్ణయించి సమాచారం ఇస్తుందని చెప్పారు. అంటే నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికను పూర్తిగా కేంద్ర నాయకత్వమే చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పేసినట్లే. వచ్చేఎన్నికల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా పెట్టుకున్న కారణంగా సీనియర్లంతా కష్టపడి నియోజకవర్గాల్లో పనిచేయాలి, ఎన్నికల్లో గెలవాల్సిందే అన్నారు.

నేతలంతా తమ మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు పక్కనపెట్టి టీమ్ స్పిరిట్ తో ముందుకు వెళ్ళాలని గట్టిగా చెప్పారు. సీనియర్లంతా ఏకతాటిపైకి వచ్చి పని చేస్తేనే విజయం లభిస్తుందన్న విషయాన్ని అమిత్ షా గుర్తుచేశారు. పార్టీ లైన్ తప్పి వ్యవహరించే ఏ నేతను కూడా సహించేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చేశారు. నేతలు ఎవరికి వాళ్ళు తమిష్టం ప్రకారం మాట్లాడితే క్యాడర్ లో అయోమయం పెరిగిపోతే పార్టీయే దెబ్బతింటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఢిల్లీ ఆపీసులో ప్రత్యేకించి వార్ రూమ్ ఏర్పాటుచేస్తామని అక్కడి నుండే మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించబోతున్నట్లు అమిత్ షా స్పష్టంగా చెప్పేశారు. పట్టుమని 40 నియోజకవర్గాల్లో కూడా పోటీకి గట్టి అభ్యర్ధులు లేని పార్టీ 75 స్ధానాల్లో ఎలా గెలుస్తుందో చూడాలి.