కేటీఆర్ అమెరికా పర్యటన.. అసలు కారణమిదేనా?
వాస్తవానికి తన కుమారుడు హిమాన్షు అమెరికాలో గ్రాడ్యుయేషన్ లో చేరుతున్న సందర్భంగా కేటీఆర్ అక్కడికి వెళ్లారు
By: Tupaki Desk | 28 Aug 2023 4:52 AM GMTబీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పురపాలక, ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి ఒక రోజు ముందు అంటే ఆగస్టు 20న కేటీఆర్ అమెరికా వెళ్లారు. ఆగస్టు 21న కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మరో నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
కాగా టికెట్ల ప్రకటన వంటి ముఖ్య కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన కేటీఆర్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే టికెట్ల కోసం తన సన్నిహితుల నుంచి, వివిధ వర్గాల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేకే ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారని టాక్ నడుస్తోంది.
వాస్తవానికి తన కుమారుడు హిమాన్షు అమెరికాలో గ్రాడ్యుయేషన్ లో చేరుతున్న సందర్భంగా కేటీఆర్ అక్కడికి వెళ్లారు. అయితే.. అసలు కారణం మాత్రం టికెట్ల కోసం ఒత్తిడిని భరించలేక, తన సన్నితులకు టికెట్లు ఇవ్వాలని తండ్రిని ఒప్పించలేకే అమెరికా వెళ్లారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఇందుకు నిదర్శనం కేటీఆర్ చేసిన ట్వీటేనని అంటున్నారు. కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాక ట్విట్టర్ ద్వారా వారందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. అలాగే బాగా పనిచేసినప్పటికీ కొన్ని సమీకరణాలతో క్రిశాంక్ లాంటి వారికి సీటు ఇవ్వలేకపోయామని తెలిపారు. వారికి పార్టీ మరో రూపంలో అవకాశం కల్పిస్తుందని చెప్పారు.
వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో భారీ మార్పులను కేటీఆర్ ఆశించారని టాక్ నడుస్తోంది. అవినీతి ఆరోపణలు, వివాదాస్పదులైన ఎమ్మెల్యేలను తప్పించి యువకులు, సమర్థులు అయిన మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బొంతు రామ్మోహన్ తదితరులకు సీట్లు ఇవ్వాలని కేటీఆర్ ఆశించారు. వీరంతా కేటీఆర్ కు సన్నిహితులు. ఆయన అప్పగించిన పనిని సమర్థవంతంగా చేసేవారిగా పేరుంది.
అయితే వీరిలో ఏ ఒక్కరికీ సీటు దక్కలేదు. కేసీఆర్ ప్రకటించబోయే జాబితా కేటీఆర్ కు ముందే తెలుసని.. అందులో తన సన్నిహితులెవరికీ టికెట్లు లేవని తేలిపోవడంతోనే కేటీఆర్ అమెరికా టూర్ పెట్టుకున్నారని అంటున్నారు.
కాగా కేటీఆర్ తన కుమారుడిని అమెరికాలో యూనివర్సిటీలో చేర్పించి తిరిగి రావాల్సి ఉంది. అయితే ఆయన అమెరికా వెళ్లి వారం దాటిపోయినా ఇంకా హైదరాబాద్ కు తిరిగి రాలేదు. తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించే పనిలో ఉన్నానంటూ అమెరికాలోనే ఉండిపోయారు. పెట్టుబడిదారులతో సమావేశాల పేరుతో యూఎస్ లోనే ఉన్నారు. కొంతమంది కంపెనీల అధినేతలతో కేటీఆర్ సమావేశమైన చిత్రాలు కూడా మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే పెట్టుబడుల కోసం ఇన్నాళ్లపాటు కేటీఆర్ ఎప్పుడూ ఎక్కడ లేరని అంటున్నారు. తన సన్నిహితుల నుంచి టిక్కెట్ల కోసం ఒత్తిడి రాకుండా, అలాగే టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు తన వద్దకు రాకుండా ఉద్దేశపూర్వకంగానే కేటీఆర్ తన అమెరికా టూరును పొడిగించుకున్నారని అంటున్నారు.