ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అయి బీయారెస్ గెలిస్తే...?
తెలంగాణాలో ఏమి జరుగుతుంది అన్న ఉత్కంఠకు తెర పడాలీ అంటే కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది
By: Tupaki Desk | 2 Dec 2023 4:31 PM GMTతెలంగాణాలో ఏమి జరుగుతుంది అన్న ఉత్కంఠకు తెర పడాలీ అంటే కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈ సండే వెరీ హీట్ డే అని తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అధికారంలో ఉన్న బీయారెస్ కి శనివారం యమ టెన్షన్ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
ఎందుకంటే అధికారంలో రెండు సార్లు ఉన్న పార్టీ. మూడవసారి రావడం కోసం ట్రై చేస్తున్న పార్టీ. పదేళ్లుగా రాజదండం చేతిలో ఉంచుకున్న పార్టీ. ఒక్కసారి లెక్క మారి అంతా తారు మారు అయితే ఇక ఏమైనా ఉందా అన్న భయాలు సందేహాలు ఎన్నెన్నో ఉంటాయి. ఈ ఎన్నికలు బీయారెస్ భవిష్యత్తుకు తేల్చేవి అని అంటున్నారు.
ఎలాగంటే ఈసారి కనుక బీయారెస్ గెలిస్తే కచ్చితంగా కేటీయార్ సీఎం అవుతారు. ఆయన ఒక్కసారి సీఎం అయ్యారు అంటే కనుక ఇక పార్టీని పూర్తి స్థాయిలో కంట్రోల్ లో పెట్టుకుని మరిన్ని దశాబ్దాల పాటు రాజకీయంగా ఎదురులేకుండా చేసుకుంటారు. ఇక కేసీయార్ కి ఇపుడు వయసు డెబ్బై. ఆయనకు ఈసారి చాన్స్ ఇస్తే తానుగానే ఏదో ఒకనాడు మంచి ముహూర్తం చూసుకుని రిటైర్ అయి కొడుకుకు పట్టాభిషేకం చేస్తారు అని అంటారు.
కేసీయార్ తానుగా రిటైర్ కావడం గౌరవం. తాను తెచ్చిన తెలంగాణా రాష్ట్రంలో తాను ఓడి మాజీ సీఎం కావడం అవమానం. అందుకంటే ఆ రోజుని ఆ ఫేట్ ని ఆయన అసలు కోరుకోవడంలేదు. దాంతో కాంగ్రెస్ కంటే బీయారెస్ కి ఇది ఇజ్జత్ మే సవాల్ గా మారింది. హ్యాట్రిక్ కొట్టి తీరాల్సిన అవసరం ఏర్పడింది.
అయితే ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా కాంగ్రెస్ కే అధికారాన్ని ముందే ఇచ్చేశాయి. రెండో మూడో మాత్రం బీయారెస్ కి అధికారం కట్టబెట్టాయి. అసలు ఎగ్జిట్ పోల్స్ ని ఎందుకు నమ్మాలి అన్నది కూడా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంటే పోలింగ్ బూత్ లో చివరి ఓటు కూడా పడిన తరువాత మొత్తం అభిప్రాయాన్ని సేకరించి దాన్ని మధింపు చేసుకుని జనాలకు ఇవ్వాలి.
కానీ జరిగింది వేరుగా ఉంది అని అంటున్నారు. ప్రీ పోల్ సర్వే రిపోర్టునే పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం అయిదున్నర నుంచే ఇవ్వడం మొదలెట్టాయని అంటున్నారు. అప్పటికి ఇంకా పోలింగ్ బూతులలో పోలింగ్ సాగుతోంది. ఆ ప్రక్రియ రాత్రి వరకూ సాగింది. మరి వారు ఎవరికి ఓటేసారు అన్నది కూడా చూడాలి కదా అన్న చర్చ ఉంది.
అంతే కాదు ఈసారి హోరా హోరీ పోరు సాగింది కాబట్టి ప్రతీ ఒక్క ఓటూ కీలకమే అంటున్నారు. అలాంటపుడు శాంపిల్స్ కొన్ని తీసుకుని అదే పూర్తిగా ఓటింగ్ అని చెప్పడం సమంజసమేనా అని కూడా ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. దాంతోనే మేమే గెలుస్తామని బీయారెస్ నేతలు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ కి ఎగ్జాక్ట్ పోల్స్ కి మధ్య భారీ తేడా ఉంటుంది అని అంటున్నారు.
ఈ క్రమంలో చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అయి మరోసారి బీయారెస్ గెలిస్తే ఏమవుతుంది అన్నది కూడా ఇపుడు అతి పెద్ద చర్చగా ముందుకు వస్తోంది. ఒకవేళ బీయారెస్ గెలిస్తే మాత్రం కాంగ్రెస్ లోని రేవంత్ రెడ్డి సహా కీలక నేతలతో పాటు ఎగ్జిట్ పోల్స్ సంస్థలను కూడా పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తారు అని అంటున్నారు.
ఎందుకంటే ప్రజల మూడ్ మార్చేలా ఇంకా పోలింగ్ సాగుతుండగానే హడావుడిగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని బీయారెస్ నేతలు ఆ రోజే ఆక్షేపించారు. తమకు నమ్మకం ఉందని డెబ్బై సీట్ల దాకా గెలుస్తామని కేటీయార్ చెబుతూ వస్తున్నారు. మరి ప్రతీ ఒక్క ఓటూ కీలకం అయిన ఈ పోరులో ఎవరూ అంచనా కట్టలేని విధంగా సాగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకూ జనాల నాడిని పట్టుకున్నాయన్నది మరి కొద్ది గంటలలో తేలనుంది.