Begin typing your search above and press return to search.

తెలంగాణ అసెంబ్లీ మారథాన్.. 10ఏఎం టు 1.30ఏఎం!

సోమవారం ఉదయం పది గంటలకు మొదలైన అసెంబ్లీ సమావేశం అర్థరాత్రి 1.30 గంటల వరకు సాగింది. నాన్ స్టాప్ గా 15.30 గంటల పాటు సాగిన సమావేశాలు సుదీర్ఘంగా సాగాయి.

By:  Tupaki Desk   |   30 July 2024 4:15 AM GMT
తెలంగాణ అసెంబ్లీ మారథాన్.. 10ఏఎం టు 1.30ఏఎం!
X

అన్ని మాట్లాడుకుందాం. అర్థరాత్రి అయినా ఫర్లేదు. సభను కంటిన్యూ చేద్దామని చెప్పటం వేరు. ఆ మాటకు తగ్గట్లు అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించటం వేరు. తాజాగా అలాంటి అరుదైన సీన్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకుంది. సోమవారం ఉదయం పది గంటలకు మొదలైన అసెంబ్లీ సమావేశం అర్థరాత్రి 1.30 గంటల వరకు సాగింది. నాన్ స్టాప్ గా 15.30 గంటల పాటు సాగిన సమావేశాలు సుదీర్ఘంగా సాగాయి. బడ్జెట్ పద్దులపై అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.

ఈ సందర్భంగా విపక్ష బీఆర్ఎస్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. పదేళ్ల పాలనలో అదనపు విద్యుదుత్పత్తిని చేపట్టిన బీఆర్ఎస్ సర్కారు.. రాష్ట్రంపై అప్పుల భారాన్ని మోపినట్లుగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుదుత్పాదననే తమ ఘనతగా చెప్పుకొని రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించిన వైనాన్ని వివరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుదుత్పత్తి.. సరఫరా మెరుగు పడినప్పటికీ సోషల్ మీడియా ద్వారా కొందరు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా మండిపడిన భట్టి.. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు పేరిట ఏటా రూ.30వేలకోట్ల భారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మోపినట్లుగా మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నుంచి ఫ్లైయాష్ తరలించేందుకు సరైన రవాణా సౌకర్యం కల్పించలేని దుస్థితి చోటు చేసుకుందన్నారు.

ఓవైపు విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. అందుకు భిన్నంగా ఆ రంగాన్ని డెవలప్ చేసినట్లుగా ప్రచారం చేసుకుందన్నారు. కానీ.. తమ ప్రభుత్వం విద్యుత్ రంగానికి భారీగా నిధుల్ని కేటాయించినట్లు పేర్కొన్నారు. అర్హులైన వారందరికి గ్రహజ్యోతిని అమలు చేస్తామని.. గ్రూప్ 1 మొయిన్స్ పరీక్ష కు అర్హత నిష్ఫత్తిని 1:100 చేయాలన్న వినతులు తమ వద్దకు వచ్చాయని.. నోటిఫికేషన్ సమయంలో అర్హత ప్రాతిపదికను 1:50గా నిర్దేశించిన నేపథ్యంలో ఎవరైనా కోర్టుకు వెళితే సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు.

ఈ కారణంతోనే తాము నిర్ణయాన్ని తీసుకోలేదని భట్టి వివరించారు. ఏమైనా.. సుదీర్ఘంగా సాగిన సభతో రాజకీయ నేతలు మాత్రమే కాదు ధికారులు.. సిబ్బంది.. మీడియా ప్రతినిధులు అలిసిపోయి.. ఇంటి ముఖం పట్టారు. ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘంగా సభ జరిగిన సందర్భం లేదన్న మాట వినిపిస్తోంది.