తెలంగాణ అసెంబ్లీ.. చర్చలు లేవ్.. అరుపులు.. కేకలే!?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
By: Tupaki Desk | 19 July 2024 7:43 AM GMTతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సర్కారు వైపు ప్రాధాన్యాలు సర్కారుకు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ ఎస్ ప్రాధాన్యాలు బీఆర్ ఎస్‌కు ఉన్నాయి. దీంతో ఇరు పక్షాల మధ్య శాంతి యుత.. పార దర్శకమైన చర్చలు అయితే.. జరిగేలా కనిపించడం లేదు. అరుపులు, కేకలు.. గలాటాలు.. పోడియం ముట్టడులు.. ఇలా.. అనేక రూపాల్లో తెలంగాణ అసెంబ్లీ రచ్చకు రెడీ అవుతోందనే సంకేతాలు వస్తున్నా యి.
సర్కారువారి వాదన:
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ప్రారంభం కానున్న సమావేశాల్లో.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ స్థానంలో వచ్చే ఏడు మాసాలకు బడ్జెట్(ఆగస్టు నుంచి మార్చి-2025) ను ప్రవేశ పెట్టనుంది. ఇక.. ఇదే సమయంలో ప్రస్తుతం చేస్తున్న రైతు రుణమాఫీ అంశాన్ని ప్రధానంగా చర్చించనుంది.అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రవేశ పెట్టనున్న పథకాలు.. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి వంటివాటిని రేవంత్ రెడ్డి సర్కారు చర్చకు పెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సవాళ్లు-ప్రతి సవాళ్లపైనా సభలో చర్చ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
విపక్షం వ్యూహం..:
ఇక, విపక్షం బీఆర్ ఎస్‌ను గమనిస్తే.. చర్చలకు బదులుగా రచ్చలకు తెరదీసేందుకు రెడీ అవుతోంది. అంటే.. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్న నేపథ్యంలో వీరిపై వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన.. బీఆర్ ఎస్ పార్టీ.. దీనిపై పట్టుబట్టే అవకాశం.. చర్చించేందుకు రచ్చ చేసే అవకాశం రెండూ కనిపిస్తున్నాయి. సహజంగానే కాంగ్రెస్ పార్టీ దీనికి అవకాశం ఇవ్వకపోవచ్చు. ఫలితంగా.. సభలో అరుపులు కేకలు కామన్ కానున్నాయి. అయితే.. గతంలో విపక్ష సభ్యులను సస్పెండ్ చేయబోమన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.
అదేసమయంలో ఆగస్టు 15 లోపు ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్న బీఆర్ ఎస్ నాయకులు.. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా హరీష్ రావు రాజీనామా వ్యవహారం సభలో ప్రధాన అంశంగా అధికార పక్షం వైపు నుంచి తెరమీదికి వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. తెలంగాణ అసెంబ్లీలో నిప్పులు కురిసే అవకాశం కనిపిస్తోంది.