తెలంగాణ అసెంబ్లీలో అరుదైన పరిస్థితి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3 నుంచి నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 1 Aug 2023 4:30 PM GMTతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3 నుంచి నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సభలో మాటల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అయితే, సభలో మాట్లాడడం సంగతి దేవుడెరుగు...అసలు ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు తనకు అర్హత ఉందా లేదా అన్న డైలమాలో బీఆర్ఎస్ నేత, అనర్హత వేటు పడ్డ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు.
ఆయన ఎన్నిక చెల్లదంటూ ఇటీవల కోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో జలగం వెంకట్ రావును ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే గురువారం నాడు ప్రారంభం కాబోతున్న సమావేశాలకు ఈ ఇద్దరు నేతలలో ఎవరు హాజరు కాబోతున్నారు అన్నదానిపై సందిగ్ధత ఏర్పడింది. తన ఎన్నిక చెల్లదంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును వనమా హైకోర్టులో సవాల్ చేయగా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురయింది. దీంతో, తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని జలగం వెంకట్రావు కోరారు.
అయితే, ఈ వ్యవహారంపై స్పీకర్ ఏ రకమైన నిర్ణయం తీసుకుబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. కోర్టు తీర్పు ప్రకారం ఈ సమావేశాలకు వనమా హాజరయ్యే ఛాన్స్ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు ప్రమాణస్వీకారం చేయలేదు కాబట్టి ఆయన హాజరవుతారా లేదా అన్నది స్పీకర్ నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకవేళ స్పీకర్ అనుమతిస్తే అసెంబ్లీకి హాజరై జలగం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కూడా టాక్ వస్తుంది.
కానీ, హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఈ వ్యవహారాన్ని స్పీకర్ పెండింగ్ లో పెడితే ఇటు వనమా అటు జలగంలలో ఏ ఒక్కరూ సభకు హాజరయ్యే ఛాన్స్ ఉండదు. ఏది ఏమైనా తెలంగాణ శాసనసభలో మునుపెన్నడూ లేని ఆసక్తికర పరిణామం జరగడం చర్చనీయాంశమైంది.